శారదానగర్ డ్రైనేజీ సమస్యకు మోక్షం
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:15 AM
నర్సీపట్నం నియోజకవర్గం.. ప్రధానంగా నర్సీపట్నం మునిసిపాలిటీలో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
స్పీకర్ అయ్యన్న ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రతిపాదనలు
ఆమోదించిన ఉన్నతాధికారులు
రూ.1.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
అసంపూర్తి డ్రైనేజీ కాలువ నిర్మాణం, బైపాస్ రోడ్డుపై బీటీ లేయర్
స్థానికులకు తీరనున్న మురుగునీటి సమస్య
నర్సీపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం నియోజకవర్గం.. ప్రధానంగా నర్సీపట్నం మునిసిపాలిటీలో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఆయా పనులకు త్వరగా ఆమోదం తెలపడం, సత్వరమే నిధులు విడుదల చేసేలా తనవంతు కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం శారదానగర్‌లో అసంపూర్తిగా వున్న డ్రైనేజీ కాలువ నిర్మాణానికి, బైపాస్ రోడ్డుపై బీటీ లేయర్ వేయడానికి నిధులు మంజూరు చేయించారు.
మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ప్రాంతంలో వున్న శారదానగర్ ఒకింత లోతట్టుగా వుంటుంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇళ్లల్లో వాడుక నీరుతోపాటు వర్షం నీరు బయటకు పోయే మార్గం సరిగా లేదు. దీంతో వర్షాకాలంలో ఎక్కువ రోజులు నీరు నిలిచిపోయి దోమల బెడద అధికంగా వుంటున్నది. ఈ సమస్య పరిష్కారానికి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు 2018లో నాటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు బలిఘట్టం బైపాస్ రోడ్డు (శారదాగనర్ రోడ్డు) అభివృద్ధి, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రూ.4.5 కోట్లు మంజూరు చేయించారు. దుర్గామల్లీశ్వరస్వామి గుడి వద్ద నుంచి బైపాస్ రోడ్డు చివరి వరకు 1.84 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి, 800 మీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ, ఒక కిలో మీటరు మేర ఓపెన్ డ్రైనేజీ పనులు చేయాలి. టెండర్ పొందిన కాంట్రాక్టర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశారు. డ్రైనేజీ కాలువల నిర్మాణానికి అడ్డుగా వున్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. వీటిని పక్కకు మార్చడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు, ఈపీడీసీఎల్‌కు రూ.30 లక్షలు చెల్లించారు. కానీ స్తంభాలు మాత్రమే తొలగించారు. ట్రాన్స్‌ఫార్మార్లను అలాగే వుంచేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గోడను ఆనుకొని డ్రైనేజీ కాలువ మీద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను డిపో లోపలికి మార్చడానికి అప్పట్లో ఆర్టీసీ అధికారులు అంగీకరించలేదు. దీంతో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేయలేనంటూ కాంట్రాక్టర్ లిఖితపూర్వకంగా ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియజేసి చేతులెత్తేశారు. బైపాస్ రోడ్డు, డ్రైనేజీ కాలువ పనులకు మొత్తం రూ.4.5 కోట్లు మంజూరు కాగా, కాంట్రాక్టర్ రూ. 3.1 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అసంపూర్తిగా వున్న డ్రైనేజీ కాలువ పనులు పూర్తిచేయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ కాలువల గోడలు పూర్తిగా పాడైపోయాయి. దీంతో శారదానగర్ వాసులకు మురుగునీటి సమస్య మరింత అధికమైంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శారదానగర్ డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులుకు పంపారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువ పనులు పూర్తి చేయడానికి, బైపాస్ రోడ్డుపై బీటీ లేయర్ వేయడానికి ప్రభుత్వం రూ.1.85 కోట్లు మంజూరు చేసింది. డ్రైనేజీ కాలువ పనులకు ఎట్టకేలకు మోక్షం కలగడంతో శారదానగర్ కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.