దొప్పెర్ల భూ సమస్యకు మోక్షం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:26 AM
భూ సమస్యపై పదిహేనేళ్లుగా పోరాడుతున్న దొప్పెర్ల బార్క్ నిర్వాసితులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. ‘అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంతో రెవెన్యూ అధికారులు స్పందిచారు. 22ఏలో చేర్చిన భూములను ఆన్‌లైన్‌లో నమోదుచేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు.
22ఏ జాబితా నుంచి సర్వే నంబర్లు తొలగింపు
ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తహశీల్దారు
ఎట్టకేలకు ఫలించిన 15ఏళ్ల పోరాటం
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
అచ్యుతాపురం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యపై పదిహేనేళ్లుగా పోరాడుతున్న దొప్పెర్ల బార్క్ నిర్వాసితులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. ‘అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంతో రెవెన్యూ అధికారులు స్పందిచారు. 22ఏలో చేర్చిన భూములను ఆన్‌లైన్‌లో నమోదుచేసే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు.
బాబా అణు పరిశోధన కేంద్రానికి (బార్క్) రోడ్డు నిర్మాణం కోసం దొప్పెర్ల పంచాయతీకి చెందిన రైతుల నుంచి 2010వ సంవత్సరంలో ప్రభుత్వం భూములు తీసుకుంది. ప్రతి సర్వే నంబరులో కొంతభూమిని ప్రభుత్వం సేకరించగా, మిగిలిన భూమి రైతుల ఆధీనంలోనే వుంది. కానీ అప్పటి అధికారులు అనాలోచితంగా మొత్తం అన్ని సర్వే నంబర్లను 22ఏలో చేర్చారు. దీంతో కుటుంబ అవసరాల నిమిత్తం భూములను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. 22ఏ జాబితా నుంచి తమ భూములను తొలగించమని రైతులు 15 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో ఉన్నతాధికారులు స్పందించారు. రైతులు తమ వద్ద వున్న ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తహశీల్దార్ సత్యనారాయణ గురువారం ప్రకటించారు. దీంతో ఎంపీటీసీ సభ్యుడు పల్లి వెంకటరావు ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం తమ భూములకు సంబంధించిన హక్కు పత్రాల నకళ్లను తహశీల్దార్‌కి అందజేశారు. ఆయన దగ్గరుండి ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపారు.