Share News

పెండింగ్‌ సమస్యలకు మోక్షం

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:26 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

పెండింగ్‌ సమస్యలకు మోక్షం

జిల్లాకు సంబంధించి పలు అంశాలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం

కేంద్రీయ విద్యాలయానికి పది ఎకరాలు కేటాయింపు

తాండవ ఆధునికీకరణ పనుల టెండర్‌ ప్రీ-క్లోజ్‌

చెర్లోపలి ఆవఖండంలో వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌ అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌

అనకాపల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనకాపల్లి మండలం సుందరయ్యపేట రెవెన్యూ సీతానగరం, అచ్చెయ్యపేట గ్రామాల పరిధిలో సర్వే నంబరు 511-2లో పది ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (సికింద్రాబాద్‌)కు అప్పగించడానికి ఆమోదం తెలిపింది. టీడీపీ గతంలో అధికారంలో వున్నప్పుడు (2014-19) కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సుందరయ్యపేట, అచ్చెయ్యపేట గ్రామాల సరిహద్దుల్లో 10 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాల కోసం భూమిని అప్పగించలేదు. గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కేంద్రీయ విదాలయానికి స్థలాన్ని కేటాయించాలని పలుమార్లు కోరడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా రెవెన్యూ అధికారులు చేసిన ప్రతిపాదన మేరకు కేంద్రీయ విద్యాలయానికి భూమి అప్పగిస్తూ ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది.

తాండవ అభివృద్ధి పనుల కాంట్రాక్టు ముగింపు

సుమారు పదేళ్లపాటు సా..గిన తాండవ రిజర్వాయర్‌ అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కాంట్రాక్టును ముందస్తుగా ముగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాండవ రిజర్వాయర్‌ కాలువల ఆధునికీకరణ కోసం 2007లో అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలవగా.. మెసర్స్‌ మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ అందరికన్నా తక్కువకు.. రూ.55.88 కోట్లకు టెండర్‌ దాఖలు చేసి పనులు దక్కించుకుంది. వివిధ కారణాల వద్ద పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మొత్తం మీద 2017నాటికి 93.82 శాతం పనులు పూర్తయ్యాయి. వీటిల్లో ముఖ్యమైనది ప్రధాన కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ పని. ఇది పూర్తికావడంతో ఆయకట్టుకు నీటి సరఫరా సాఫీగా జరిగింది. మిగిలిన పనులు పూర్తిచేయకపోవడంతో కాంట్రాక్టును ప్రభుత్వం ముగించలేదు. కాగా కార్మికులు అందుబాటులో లేకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతోపాటు కరోనా కారణంగా నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయామని, అందువల్ల ముందస్తు ముగింపు (ప్రీ-క్లోజ్‌) చేయాలని 2020లో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి జలవనరుల శాఖ అప్పటి విశాఖపట్నం సర్కిల్‌ ఎస్‌ఈ సానుకూలంగా రిపోర్ట్‌ ఇచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం ప్రీకోజర్‌కు ఆమోదం తెలపలేదు. ఈ కారణంగా నిర్మాణ సంస్థకు సాంకేతికంగా పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. పలు నిబంధనలతో తాండవ పనుల కాంట్రాక్టును ప్రీ-క్లోజ్‌ చేస్తూ ఆమోదం తెలిపింది.

చెర్లోపల్లి ఆవ ఖండం భూములకు విముక్తి

ఇదిలావుండగా అనకాపల్లి మండలం చెర్లోపల్లి ఆవ ఖండంలో వీఎంఆర్‌డీఏ (గతంతో వుడా) వివిధ అవరాల నిమిత్తం 2007లో రైతుల నుంచి భూమిని సమీకరించింది. లేఅవుట్‌ వేసిన తరువాత అభివృద్ధి చేసిన ప్లాట్లలో కొన్నింటిని రైతులకు ఇస్తామని ఒప్పందం చేసుకుంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఎంపీ, ఎమ్మెల్యేల దృష్టికి రావడంతో వారి వినతి మేరకు వీఎంఆర్‌డీఏ సమీకరించిన 58.18 ఎకరాల భూమిని అభివృద్ధి చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Updated Date - Jul 25 , 2025 | 01:26 AM