Share News

సాగునీటి కష్టాలకు తెర

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:39 AM

మండలంలోని పలు గ్రామాల రైతులకు రానున్న ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. శిథిలావస్థకు చేరిన మదుములు, గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

సాగునీటి కష్టాలకు తెర
గత ప్రభుత్వ హయాంలో మదుములు తలుపులు పాడైపోవడంతో అడ్డుగా కర్రలు, గోనె సంచులు పెట్టిన రైతులు

కాలువలపై మదుములకు గేట్లు ఏర్పాటు

పాయకరావుపేట రూరల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల రైతులకు రానున్న ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. శిథిలావస్థకు చేరిన మదుములు, గేట్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో సాగునీటి వనరులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆనకట్టలు, కాలువలు, మదుములు, గేట్ల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో పొలాలకు నీరు సరిగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. మదుముల తలుపులు పూర్తిగా ధ్వంసం కావడంతో నీటికి అడ్డంగా అరటి బొందలు, తుక్కు అడ్డుగా వేసి పొలాలకు నీరు పారించుకునేవారు. గత ఏడాది కూటిమి అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి వనరులపై దృష్టి సారించింది. మండలంలోని కాలువలపై మదుములు, తలుపుల మరమ్మతులకు విడతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నది. మొదటి విడత రూ.30.42 లక్షలతో శ్రీరాంపురం, గోపాలపట్నం, పెదరాంభద్రపురం, కేశవరం, రాజగోపాలపురం, పెంటకోట, సత్యవరం, మాసాహెబ్‌పేట, గుంటపల్లి తదితర గ్రామాల పరిధిలోని 11 ప్రాంతాల్లో మదుములకు కొత్త తలుపులు అమర్చారు. రెండవ విడతలో సుమారు రూ.75 లక్షలతో భూమి కాలువపై మదుములు, తలుపుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్టు ఇరిగేషన్‌ శాఖ ఏఈఈ జి.శ్రీరామ్మూర్తి తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:39 AM