బెర్రీ బోరర్ నియంత్రణకు పక్కా ప్రణాళిక
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:54 PM
గిరిజన ప్రాంతంలో ప్రప్రథమంగా బయటపడిన కాఫీ బెర్రీ బోరర్ కీటకాన్ని శాశ్వతంగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. తొలి ఏడాదిలోనే అధికార యంత్రాంగం కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందిన తోటల్లో యుద్ధప్రాతిపదికన నియంత్రణ చర్యలను చేపట్టింది.
కాఫీ తోటల్లో మూడేళ్ల పాటు చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ
156 ఎకరాల్లో కీటకం ఉధృతి అధికం
నివారణ చర్యలు పూర్తి
1700 ఎకరాల్లో పాక్షికం
కొనసాగుతున్న సర్వే
కీటకం ఎలా వచ్చిందనే దానిపై అధికారుల అధ్యయనం
చింతపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ప్రప్రథమంగా బయటపడిన కాఫీ బెర్రీ బోరర్ కీటకాన్ని శాశ్వతంగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. తొలి ఏడాదిలోనే అధికార యంత్రాంగం కాఫీ బెర్రీ బోరర్ వ్యాప్తి చెందిన తోటల్లో యుద్ధప్రాతిపదికన నియంత్రణ చర్యలను చేపట్టింది.
చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంతో పాటు అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో 156 ఎకరాల్లో బెర్రీ బోరర్ కీటకం ఉధృతి అధికంగా కనిపించింది. ఈ తోటల్లో కాఫీ కాయలను పూర్తిగా స్ట్రిప్పింగ్ చేశారు. పాక్షికంగా కీటకం ఆశించిన 1,700 ఎకరాల్లో నివారణ చర్యలు ప్రారంభించారు. కీటకం ఉధృతిపై ఏజెన్సీ పదకొండు మండలాల్లోనూ అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పరిమితమైన కాఫీ బెర్రీ బోరర్ కీటకాన్ని తొలిసారిగా అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలోని మహిళా రైతు సిరగం సువర్ణ తోటల్లో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ తోటకు ఆనుకుని వున్న గ్రామాల్లో సర్వే చేపట్టగా పకనకుడితో పాటు మాలివలస, మాలసింగారం, చినలబుడు, తురాయ్‌గుడ, గరడగుడ, పెదలబుడు గ్రామాల్లో ఇప్పటికి 156 ఎకరాల్లో కాఫీ బెర్రీ బోరర్ ఉధృతి అధికంగా కనిపించింది. గత ఏడాది అరకులోయ ప్రాంతం నుంచి కాఫీ పండ్లను పల్పింగ్‌కి చింతపల్లి తీసుకునిరావడం వల్ల ఎకో పల్పింగ్ యూనిట్‌కి ఆనుకుని వున్న ఉద్యాన పరిశోధన స్థానంలో ఈ తెగులు కనిపించింది. గిరిజన ప్రాంత కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ కీటకం ఆశించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకుని నియంత్రణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పర్యవేక్షణలో కేంద్ర కాఫీ బోర్డు, వెంకట రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉద్యానశాఖ, ఐటీడీఏ ప్రాజెక్టు ఉద్యానశాఖ, కాఫీ ప్రాజెక్టు అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, వ్యవసాయ, ఉద్యాన విద్యార్థులు చింతపల్లి, అరకులోయలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. కీటకం ఉధృతి అధికంగా వున్న 156 ఎకరాల్లో కాఫీ కాయలను సేకరించి వేడినీళ్లలో మూడు నిమిషాల పాటు ముంచి భూమిలో పాతిపెట్టారు. పాక్షికంగా కీటకం ఉధృతి కనిపించిన 1700 ఎకరాల్లోనూ నియంత్రణ చర్యలు ప్రారంభించారు. ఈ తోటల్లో బ్రోక ట్రాప్స్ పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు బ్యూవేరియా బస్యానా జీవసిలింద్రనాశిని పిచికారీ చేస్తున్నారు.
మూడేళ్లపాటు నియంత్రణ చర్యలు
కాఫీ బెర్రీ బోరర్ కీటకాన్ని తొలి ఏడాది పూర్తి స్థాయిలో నియంత్రించడం సాధ్యంకాదని శాస్త్రవేత్తలు, అధికారులు అంటున్నారు. వచ్చే ఏడాది కాఫీ తోటల్లో ఈ కీటకం కనిపించే అవకాశం లేకపోలేదన్నారు. ఈ మేరకు మూడేళ్లపాటు కాఫీ తోటల్లో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది కాఫీ పండ్ల సేకరణ పూర్తి చేసే వరకు అధికారులు కాఫీ బెర్రీ బోరర్‌పై రైతుల తోటల్లో సర్వేను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చే ఏడాది పిందె దశ నుంచి మరోసారి కాఫీ తోటల్లో సర్వేను చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ కాఫీ బెర్రీ బోరర్ కనిపిస్తే వెంటనే నియంత్రణ చర్యలు ప్రారంభించనున్నారు. మూడేళ్లపాటు ఈ ప్రక్రియను కొనసాగించేలా అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు.
కాఫీ బెర్రీ బోరర్ ఎలా వచ్చింది?
గిరిజన ప్రాంతానికి కాఫీ బెర్రీ బోరర్ కీటకం ఏవిధంగా వచ్చి వుంటుందని అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ కీటకం కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మాత్రమే ఉంది. గిరిజన ప్రాంతానికి ఏ విధంగా వచ్చి వుంటుందనే కోణంలో పరిశీలన చేస్తున్నారు. అరకులోయ నుంచి పొరుగు రాష్ట్రాలకు కాఫీ ఎగుమతి చేయడం, అక్కడ నుంచి ఖాళీ గోనె సంచులను తీసుకు రావడం వల్ల ఈ కీటం గిరిజన ప్రాంతానికి వచ్చివుంటుందని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రాథమిక దశలోనే ఈ తెగులును గుర్తించడం వల్ల కేవలం అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఈ కీటకం కనిపించలేదు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడం వలన కీటకం వ్యాప్తి తీవ్రతను అరికట్టగలిగారు.