మన్యంలో ముసురు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:21 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లాలో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మోస్తరు నుంచి భారీ వర్షం
పొంగిన వాగులు, గెడ్డలు
కించుమండలో విద్యుత్ స్తంభంపై పడిన పిడుగు
విద్యుత్ పరికరాలు దగ్ధం
పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లాలో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా ఒడిశా రాష్ట్రానికి చేరువగా ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న చింతూరు డివిజన్ పరిధిలోనే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాడేరు, చింతూరు డివిజన్‌ల పరిధిలో గెడ్డలు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. పల్లెలు ముంపునకు గురికావడం వంటి సమస్యలతో జనం అవస్థలు పడుతున్నారు. అలాగే తాజా వాతావరణంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజల్ని అప్రమత్తం చే సింది.
ముంచంగిపుట్టులో..
మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మోస్తరుగాను.. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం పడింది. దీంతో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారీ వర్షానికి వాగులు, వంకలు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి. లక్ష్మీపురం పంచాయతీ కర్లాపొదర్, దొరగూడ, ఉబ్బెంగుల, ముంతగుమ్మి తదితర గ్రామాల సమీపంలో గెడ్డలు పరవళ్లు తొక్కాయి. రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గెడ్డలపై వంతెనలు నిర్మించాలని ఆ ప్రాంతీయులు కోరుతున్నారు.
డుంబ్రిగుడలో..
మండలంలో శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కించుమండ గ్రామంలో విద్యుత్ స్తంభంపై పిడుగు పడింది. దీంతో వంద ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, వీధి లైట్లు దగ్ధమయ్యాయి. తాము తీవ్రంగా నష్టపోయామని గ్రామస్థులు వాపోయారు. తమను ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా సాంకేతిక పరికరాన్ని ఏర్పాటు చేయాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులను కించుమండ గిరిజనులు కోరారు.