Share News

జీఎంల చేతికి పలుగు, పార!

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:17 AM

స్టీల్‌ప్లాంటులో ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

జీఎంల చేతికి పలుగు, పార!

స్టీల్‌ప్లాంటు ఇన్‌చార్జి సీఎండీ విచిత్రమైన నిర్ణయాలు

మరో నెల రోజుల్లో రిటైర్‌ కాబోయే ఉన్నతాధికారులకు కన్వేయర్‌ బెల్ట్‌ల వద్ద విధులు

ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటున్న ఉద్యోగ వర్గాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ప్లాంటులో ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలకు రూ.2 లక్షల జీతం తీసుకునే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల చేతికి గునపాలు, పారలు ఇచ్చి కూలి పనులు చేయిస్తున్నారు. వారంతా ఇంకో నెల రోజుల్లో రిటైర్‌ కావలసి ఉంది. రెండు రోజుల క్రితమే వారి వీఆర్‌ఎస్‌కు కూడా ఆమోదం తెలిపారు. అటువంటి వారితో కూలి పనులు చేయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏమి చేసినా తనను ఎవరూ ప్రశ్నించడం లేదనే ధీమానే సీఎండీతో ఇవన్నీ చేయిస్తోందనే వాదన వినిపిస్తోంది.

కర్మాగారంలోని రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) నుంచి ఐరన్‌ఓర్‌, కోల్‌, లైమ్‌ స్టోన్‌, తదితర ముడి పదార్థాలను కన్వేయర్ల ద్వారా విభాగాలకు తరలిస్తున్నప్పుడు మెటీరియల్‌ కొంత కింద పడిపోతుంది. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయడానికి కాంట్రాక్టు కూలీలు ఉంటారు. వారికి నెలకు రూ.20 వేలు జీతం ఇచ్చేవారు. అలాంటి పనులు చేసే కాంట్రాక్టు వర్కర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, మే నెలలో 4,500 మందిని సీఎండీ తొలగించారు. దాంతో సిబ్బంది కొరత ఏర్పడింది. కింద పడిన మెటీరియల్‌ భారీగా ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో కన్వేయర్లు రెండు వారాలుగా సరిగా నడవడం లేదు. దాంతో ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. పేరుకుపోయిన కుప్పలను తొలగించడానికి కూలీలను పెట్టుకుంటే సరిపోతుంది. కానీ సీఎండీ కూలీలకు బదులుగా లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సీనియర్‌ ఉన్నతాధికారులకు ఆ పనులు పురమాయించారు. ఇంకో నెల, రెండు నెలల్లో రిటైర్‌ కావలసిన 263 మంది ఉన్నతాధికారులను ఆర్‌ఎంహెచ్‌పీలో పనిచేయాలని సోమవారం సాయంత్రం ఆదేశించారు. వారంతా మంగళవారం అక్కడకు వెళ్లి పలుగు, పారలు చేతపట్టి పేరుకుపోయిన కుప్పల తొలగింపు పనులు ప్రారంభించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన స్టీల్‌ప్లాంటులో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.

మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌) అనే సంస్థ సీఎండీగా పనిచేస్తున్న ఏకే సక్సేనాను గత సెప్టెంబరులో తీసుకువచ్చి ఇన్‌చార్జి సీఎండీగా నియమించారు. ఆయన పదవీ విరమణ సమయం ఇంకో మూడు నెలలు ఉంది. వాస్తవానికి స్టీల్‌ సీఎండీగా శక్తిమణి అనే అధికారిని కేంద్ర కమిటీ ఎంపిక చేసింది. ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ఈయన్నే కొనసాగించడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను నడపడానికి అడ్డగోలు ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తి వ్యయం పెంచారనే విమర్శలు ఉన్నాయి. వంద శాతం ఉత్పత్తి చేస్తామని చెప్పిన ఆయన ప్లాంటును నష్టాల ఊబిలోకి నెడుతున్నారు.

ఐడీ కార్డు చూపిస్తేనే టీ, టిఫిన్లు

వారం క్రితం స్టీల్‌ప్లాంటులో ప్రైవేటు క్యాంటీన్లన్నీ మూసివేయించారు. 25 వేల ఎకరాల్లో విస్తరించి, 20 వేల మంది పనిచేసే ప్రాంతంలో యాజమాన్యం నిర్వహిస్తున్న క్యాంటీన్లు 12 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనిచేస్తున్నాయి. వాటిలో కూడా సిబ్బందిని ఇటీవల తగ్గించేశారు. ఇప్పుడు ఆ క్యాంటీన్లలో ఐడీ కార్డు చూపిస్తే తప్ప టీ, టిఫిన్లు ఇవ్వడం లేదు. పొరపాటున ఒక విభాగం వారు మరో విభాగానికి వెళ్లి టీ అడిగితే లేదు పొమ్మంటున్నారు.

మూడు నెలల జీతం పెండింగ్‌

సీఎండీగా సక్సేనా వచ్చిన తరువాత ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ కట్‌ చేశారు. ఇంక్రిమెంట్లు ఇవ్వడం మానేశారు. క్వార్టర్లలో ఉంటున్న వారికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌కు ఇప్పుడు యూనిట్‌కు రూ.8 చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రతి నెల జీతంలో 70 శాతం మాత్రమే ఇస్తున్నారు. 30 శాతం కోత పెడుతున్నారు. అలా మొత్తం మూడు నెలల జీతం పెండింగ్‌లో ఉంది. రిటైరైన వారికి సెటిల్‌మెంట్‌ త్వరగా చేయడం లేదు.

కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పెద్దలను ఒప్పించి రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం ఇప్పిస్తే...ఇక్కడ సవ్యంగా ప్లాంటును నడపాల్సిన ఉన్నతాధికారులు ఆందోళనలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Aug 27 , 2025 | 01:17 AM