Share News

డీఆర్‌సీలో సమస్యల ఏకరువు

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:07 AM

జిల్లాలో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారుల అలసత్వం...తదితర అంశాలపై జిల్లా సమీక్షా మండలి సమావేశం శుక్రవారం వాడి,వేడిగా చర్చ జరిగింది.

డీఆర్‌సీలో సమస్యల ఏకరువు

  • టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు ఆరోపణ

  • విచారణకు ఆదేశించిన ఇన్‌చార్జి మంత్రి

  • నగరంలో వీధి దీపాల నిర్వహణపై ఎంపీ, ఎమ్మెల్యేల అసంతృప్తి

  • ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ప్లాట్లను 22-ఎలో చేర్చడంపై గాజువాక ఎమ్మెల్యే పల్లా నిలదీత

  • నేరేళ్లవలస- తాళ్లవలస మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యేల అభ్యంతరం

  • 100 గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ విజ్ఞప్తి

  • అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఫిర్యాదు

  • విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు

  • పునరుద్ధరించాలని కోరిన విష్ణుకుమార్‌రాజు

  • ఫిల్మ్‌ క్లబ్‌కు స్థలం కేటాయింపుపై పునఃపరిశీలించాల్సిందిగా వినతిపత్రం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారుల అలసత్వం...తదితర అంశాలపై జిల్లా సమీక్షా మండలి సమావేశం శుక్రవారం వాడి,వేడిగా చర్చ జరిగింది. టిడ్కో ఇళ్ల కేటాయింపు, వసతులు లేకుండా లబ్ధిదారులకు అప్పగింత, నగరంలో వీధి దీపాల నిర్వహణ, జీవీఎంసీలో ప్రణాళికా విభాగం పనితీరు, పలు శాఖల అధికారుల ప్రోటోకాల్‌ ఉల్లంఘన, నేరేళ్లవలస-తాళ్లవలస మాస్టర్‌ప్లాన్‌ రోడ్డు ప్రతిపాదన...వంటి వాటిపై ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీశారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగింది. తొలుత గత ఏడాది అక్టోబరు 25న జరిగిన డీఆర్‌సీలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు. అనంతరం మంత్రి బాల వీరాంజనేయస్వామి చర్చ ప్రారంభిస్తూ పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమ, విశాఖ తూర్పు ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు, రిజిస్ట్రేషన్‌లలో పలు అవకవతకలు జరిగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో లబ్ధిదారులను ఎంపిక చేసి అలాట్‌మెంట్‌ పత్రం ఇస్తే, తరువాత వైసీపీ పాలనలో కొందరు వాటిని తారుమారు చేశారన్నారు. మంత్రి స్పందిస్తూ విచారణ చేయాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ను ఆదేశించారు.

నగరంలో వీధి దీపాల నిర్వహణపై ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నగరంలో 22 వాట్స్‌ కలిగిన వీధి దీపాల వల్ల ప్రయోజనం లేదని, నిర్వహణ ఏమి బాగాలేదని వ్యాఖ్యానించారు. కొత్తగా దీపాలు అమర్చే ముందు తొలుత ఆడిట్‌ చేయాలని ఎంపీ సూచించగా, చాలాచోట్ల దీపాలు వెలగడంలేదని ఎమ్మెల్యేలు పెదవివిరిచారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ, ఏపీ ఆయిల్‌ సీడ్స్‌ సహకార సంస్థ చైర్మన్‌ గండి బాబ్జీ మాట్లాడుతూ నగరంలో 100 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విషయంలో జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బంది అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 100 గజాలలోపు ప్లాన్‌ అవసరం లేదని ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా ప్రజలకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. గాజువాకలో పట్టణ ప్రణాళికా విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కోరారు. గెడ్డలు, చెరువుల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణపై రెవెన్యూ అధికారులు పదేపదే సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపిస్తున్నారన్నారు. గాజువాకలో చెరువుల్లో లేఅవుట్‌లు వేసి (సిద్ధార్థ నగర్‌, ఆర్టీసీ కాలనీ) ప్రభుత్వమే భూమి అమ్మిందని, ఇప్పుడు వాటిని 22-ఎలో చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రోడ్డు నిర్మించే క్రమంలో నిరాశ్రయులైన వారికి కేటాయించిన ఇళ్ల కాలనీని కూడా 22-ఎలో పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్రానని ఆరోపించారు. కొత్తగాజువాక నుంచి లంకెలపాలెం వరకూ సర్వీస్‌ రోడ్లు ఏర్పాటుచేయాలని కోరారు. గంగవరం పోర్టు నిర్వాసితులకు ఉద్యోగాలు, ఇతర ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ వేపగుంట-పినగాడి రోడ్డు నిర్మాణ పనుల్లో కాలయాపన జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపామని, ఎన్‌డీబీ సాయంతో పనులు చేపడతామన్నారు. చినముషిడివాడ సర్వే నంబరు 163లో ఆక్రమణలు తొలగించాలని రమేష్‌బాబు కోరారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ సదరం స్లాట్‌ బుకింగ్‌లో ఇబ్బందులు తొలగించాలని, ప్రజలకు సమీపంలో ఆస్పత్రులలో స్లాట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరాసలో రాత్రిపూట అల్లరిమూకల చెలరేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ వారిని నియంత్రించాలన్నారు. కాకానినగర్‌ వద్ద హైవేపై అండర్‌పాస్‌ ఏర్పాటుచేయాలని కోరగా త్వరలో పనులు చేపడతామని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాంజీ ఎస్టేట్‌లో ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరగా...పాఠశాలను పరిశీలించామని, త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్‌ పేర్కొన్నారు. మాధవధారలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేయగా...భూ వివాదాల కేసులపై దృష్టిసారించామని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కోరారు. ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌కు స్థలం కేటాయింపుపై పునఃపరిశీలన చేయాలంటూ ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన వినతిపత్రం అందజేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నగర పరిసరాల్లో పలు మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల అభివృద్ధి గురించి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ వివరించారు. అయితే నేరేళ్లవలస-తాళ్లవలస మాస్టర్‌ ప్లాన్‌ రోడ్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైసీపీ నేతలకు చెందిన భూములకు ప్రయోజనం కోసం ఆ రోడ్డు ఉపయోగపడుతుందన్నారు. ఆ రోడ్డు నిర్మిస్తే అక్కడ ఉన్న వీఎంఆర్‌డీఏకు చెందిన భూములకు విలువ పెరుగుతుందని కమిషనర్‌ వివరణ ఇవ్వగా మంత్రి జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేశారు.

ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ అధికారుల తీరులో మార్పు రావాలని, ఒకేచోట ఎక్కువకాలం పనిచేసే ఉపాధ్యాయులను తప్పకుండా బదిలీలు చేయాలని కోరారు. నగరంలో అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ అంటూ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నగరానికి ఆనుకుని మేహాద్రిగెడ్డ, గంభీరం రిజర్వాయర్లను జీవీఎంసీకి అప్పగించాలన్న అంశంపై పలువురు సభ్యులు ప్రస్తావించారు. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు ఏటా రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం జల వనరుల శాఖకే ఉందని అధికారులు పేర్కొన్నారు. గంభీరం నిర్వహణ బాధ్యతలు జీవీఎంకి అప్పగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వెల్లడించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎన్టీఆర్‌ వైద్య సేవ వైస్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, డీఆర్వో సత్తిబాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌, వీఎంఆర్‌డీఎ కమిషనర్‌ విశ్వనాథన్‌ ప్రస్తుతం జరుగుతున్న పనులు, చేపట్టబోయే ప్రాజెక్టులు, మాస్టర్‌ప్లాన్‌ రోడ్లపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఆర్థిక రాజధానిగా విశాఖ

అందుకు తగిన ప్రమాణాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు కార్యాచరణ

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికాయుతంగా పనిచేస్తాం

ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

దేశంలో ప్రముఖ నగరాల్లో ఒకటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తగిన కార్యాచరణతో ముందుకువెళ్లాలని అధికారులకు సూచించినట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన పలు అంశాలపై యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలను అనంతరం విలేకరులకు వివరించారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళికాయుతంగా పనిచేస్తామన్నారు. వేసవిలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకులను అందుబాటులో ఉంచాలని ఆదేశించామని, శానిటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు వేగంగా పూర్తిచేయాలని సూచించామన్నారు. పలు శాఖలకు సంబంధించి భూములు, ఇతర అంశాలపై పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించామన్నారు. ప్రతి శాఖలో పెండింగ్‌ కేసులపై ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు. సింహాచలం భూముల వివాదంపై ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టిసారించిందని మంత్రి వివరించారు.

అసెంబ్లీ సెగ్మెంటంతా ఒకే జోన్‌లోకి...

డీఆర్‌సీలో కలెక్టర్‌ ప్రతిపాదన

అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వానికి పంపుతామని వెల్లడి

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

ఒక అసెంబ్లీ నియోజకవర్గమంతా ఒకే జోన్‌లో ఉండేలా మార్పులు, చేర్పులు చేస్తామని, దీనిపై అందరి అభిప్రాయం తీసుకుని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి మంత్రి డాక్టర్‌ డోల శ్రీబాల వీరాంజనేయస్వామి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశంలో జీవీఎంసీ జోన్‌లపై కలెక్టర్‌ మాట్లాడుతూ అసెంబ్లీ పరిధిలో ఒకటి, రెండు అంతకంటే ఎక్కువ జోన్‌లు ఉండడంతో పాలనాపరమైన ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భీమిలి అసెంబ్లీ పరిధిలో 1, 2 జోన్‌లతోపాటు మూడో జోన్‌లో కొంత భాగం ఉందన్నారు. గాజువాక తప్ప మిగిలిన నియోజకవర్గాల పరిధిలో ఒకటి, అంతకంటే ఎక్కువ జోన్‌లు ఉన్నాయని అనగా విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జోన్‌ ఉంటే పాలనాపరంగా శాసనసభ్యుడు తన పరిధిలో జోన్‌ కమిషనర్‌తో చర్చించుకుంటారన్నారు. అయితే భీమిలి మొత్తం ఒక జోన్‌ కాకుండా రెండు జోన్‌లకు పరిమితం చేస్తే తొమ్మిది జోన్‌లు అవసరమవుతాయని అనగా...కలెక్టర్‌ స్పందిస్తూ జోన్‌ల సంఖ్య ఎనిమిదికి మించరాదన్నారు. దీనిపై మరోసారి చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పగానే ఎమ్మెల్యేలంతా సమ్మతి తెలిపారు.

Updated Date - Apr 26 , 2025 | 01:07 AM