సబ్సిడీ రాజ్‌మా విత్తనాల కోసం తోపులాట
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:50 PM
మండలంలోని అడుగులపుట్టు రైతు సేవా కేంద్రం వద్ద సబ్సిడీపై అందిస్తున్న రాజ్‌మా విత్తనాల కోసం గురువారం తోపులాట జరిగింది.
పట్టాకు కేవలం 10 కిలోలు మాత్రమే ఇవ్వడంపై రైతులు అసహనం
పెదబయలు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అడుగులపుట్టు రైతు సేవా కేంద్రం వద్ద సబ్సిడీపై అందిస్తున్న రాజ్‌మా విత్తనాల కోసం గురువారం తోపులాట జరిగింది. రైతులు ఉదయాన్నే ఈ సేవా కేంద్రం వద్దకు చేరుకున్నారు. 90 శాతం సబ్సిడీపై అందిస్తున్న విత్తనాల కోసం సచివాలయం పరిధిలోని అడుగులపుట్టు, లక్ష్మీపేట పంచాయతీలకు చెందిన రైతులు ఒకేసారి రావడంతో రద్దీ నెలకొంది. వాస్తవానికి అడుగులపుట్టు సచివాలయానికి నాలుగు టన్నుల విత్తనాలు కేటాయించగా అవి సరిపోలేదు. దీంతో మరో అరటన్ను కేటాయించారు. అయితే ఒక పట్టాలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కేవలం 10 కిలోలు మాత్రమే విత్తనాలు అందించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒక్కో రైతు ఎకరం నుంచి సుమారు ఐదు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు తమకు సరిపోవడం లేదని వారు వాపోతున్నారు. సబ్సిడీ విత్తనాలు సరిపోవేమోనని భావనతో రైతులు సేవా కేంద్రం వద్ద తోసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మండల వ్యవసాయ అధికారి సునీల్ వివరణ కోరగా, సీతగుంట పరిధిలో మూడు టన్నులు, అడుగులపుట్టు సచివాలయం పరిధిలో నాలుగు టన్నుల చొప్పున విత్తనాలు కేటాయించామన్నారు. అయితే రైతులు అధికంగా రావడంతో అడుగులపుట్టు సచివాలయానికి మరో అరటన్ను కేటాయించినట్టు ఆయన తెలిపారు. మండల వ్యాప్తంగా రెండు వేల ఎకరాలకు ఈ-క్రాప్ నమోదైందని, అయితే 50 టన్నులు మాత్రమే మండలానికి కేటాయింపులు జరిగినట్టు ఆయన చెప్పారు. వీటిని రైతులకు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు.