Share News

గూడు లేని బడి!

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:04 AM

గిరిజన ప్రాంతంలో వందల సంఖ్యలో పాఠశాలలకు భవనాలు లేని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ‘నాడు- నేడు’తో విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చామని గొప్పలు చెబుతున్న వైసీసీ ప్రభుత్వ హయాంలో ఒక్క పాఠశాలకు భవనాన్ని నిర్మించలేదు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం పాఠశాలలకు భవనాలను నిర్మించడంలో శ్రద్ధ కనబరచడం లేదు. దీంతో జిల్లాలో 363 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కనీస గూడు లేని పరిస్థితి నెలకొంది.

గూడు లేని బడి!
చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ మూలగరువు పాకలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు

జిల్లాలో భవనాలు లేని స్కూళ్లు 363

నేటికీ పాకలు, షెడ్లలోనే విద్యా బోధన

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క భవనం కట్టని పరిస్థితి

కూటమి పాలనలోనూ పట్టించుకోని దుస్థితి

భవనాల సమస్యకు శాశ్వత పరిష్కారం

చూపాలని తల్లిదండ్రుల వేడుకోలు

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

గిరిజన ప్రాంతంలో వందల సంఖ్యలో పాఠశాలలకు భవనాలు లేని దుస్థితి చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. ‘నాడు- నేడు’తో విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చామని గొప్పలు చెబుతున్న వైసీసీ ప్రభుత్వ హయాంలో ఒక్క పాఠశాలకు భవనాన్ని నిర్మించలేదు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం పాఠశాలలకు భవనాలను నిర్మించడంలో శ్రద్ధ కనబరచడం లేదు. దీంతో జిల్లాలో 363 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కనీస గూడు లేని పరిస్థితి నెలకొంది.

అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలో పాఠశాలలకు భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నారుల అవస్థలు వర్ణణాతీతం. గత నెల రోజుల నుంచి పాఠశాలలకు భవనాలు నిర్మించాలంటూ అనేక మండలాల్లో తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తూ.. సమస్యను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళుతున్నారు. వాస్తవానికి సుమారు పదేళ్ల నుంచి ఏజెన్సీలో ప్రాథమిక పాఠశాలలకు భవనాలు నిర్మించలేదు. కొన్నేళ్లుగా గిరిజనులకు సైతం విద్య ప్రాముఖ్యత తెలియడంతో వారి పిల్లలను విధిగా పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకులాల్లోని సైతం శత శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రధానంగా ప్రాథమిక విద్యాభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగానే భవనాల లేమి, ఉపాధ్యాయుల కొరత వెంటాడుతున్నది. దీంతో ఆశించిన స్థాయిలో ప్రాథమిక విద్య గిరి బాలలకు అందడం లేదనేది అక్షర సత్యం.

ఒక్క భవనం నిర్మించిన వైసీపీ ప్రభుత్వం

విద్యారంగంలో విశేష సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పే వైసీపీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో జిల్లాలోని ఒక్క పాఠశాలకు భవనం నిర్మించలేదు ‘నాడు-నేడు’ కార్యక్రమంలో కేవలం 20 శాతం పాఠశాలల్ని మాత్రమే ఎంపిక చేసుకుని, వాటికే కోట్లాది రూపాయాలు వ్యయం చేసి అనవసర హంగులు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో గూడు లేని బడుల గురించి పట్టించుకోలేదు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మీడియా పలుమార్లు పాలకుల దృష్టికి భవనాల సమస్యను వెళ్లినప్పటికీ వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీంతో కొన్నిచోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే పాఠశాలలకు వసతి ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు ముంచంగిపుట్టు మండలం సారధి గ్రామంలో, పెదబయలు మండలం కొరవంగి పంచాయతీ పరిధిలో బొడ్డగొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు ఎటువంటి భవనాలు లేవు. దీంతో గ్రామస్థులు విరాళాలు వేసుకొని సిమెంట్‌ రేకులతో సొంతంగా భవనాలు నిర్మించారు. ప్రస్తుతం పాఠశాలల నిర్వహణ ఆ షెడ్లల్లోనే కొనసాగుతున్నది. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 46 పాఠశాలలకు భవనాలు లేవు. అలాగే ముంచంగిపుట్టులో 43, పెదబయలులో 37, హుకుంపేటలో 26, వై.రామవరం, జి.మాడుగులలో 25, జీకేవీధిలో 22, చింతూరులో 20, మిగిలిన మండలాల్లో 20 లోపు పాఠశాలలకు భవనాలు లేవు.

అమలు కాని కూటమి మంత్రుల హామీలు

గిరిజన ప్రాంతంలోని వసతి లేని ప్రాథమిక పాఠశాలలకు భవనాలను నిర్మిస్తామని గతేడాది జూలైలోనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ముంచంగిపుట్టు మండలం కెందుగూడ గ్రామంలోని గిరిజనులు శ్రమదానంతో పాఠశాలకు షెడ్‌ నిర్మాణం చేసుకున్న వైనం మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వెళ్లడడంతో ఆయన ఆ పాఠశాల భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. అలాగే తొలి విడతగా గిరిజన ప్రాంతంలో భవనాలు లేని 408 పాఠశాలలకు భవనాలను నిర్మించేందుకు రూ.56 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది జూలై నెలలో ఇక్కడికి వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం ఇదే విషయాన్ని అప్పట్లో ప్రస్తావించారు. కాని నేటికీ ఏడాదవుతున్నా గిరిజన ప్రాంతంలో పాఠశాలలకు భవనాల నిర్మాణంపై ఇద్దరు మంత్రులు ఇచ్చిన హామీలు సైతం నెరవేరలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ స్పందించి పాఠశాల భవనాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరి బాలల తల్లిదండ్రులు కోరుతున్నారు.

8జీకేవీ3 మాకు టీచర్‌ కావాలని పలకలో రాసి చూపిస్తున్న పెదగ్రహారం విద్యార్థిని, విద్యార్థులు

జీకే వీధిలో 22 పాఠశాలలు మూత

ఉపాధ్యాయులు లేక ప్రారంభం కాని విద్యా భోధన

స్కూల్‌కి వచ్చి టీచర్ల కోసం విద్యార్థులు ఎదురుచూపులు

మధ్యాహ్న భోజనం చేసి ఆడుకుంటున్న చిన్నారులు

పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులు

గూడెంకొత్తవీధి, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

మండలంలో 22 గిరిజన సంక్షేమ శాఖ, మండల పరిషత్‌ పాఠశాలలు ఉపాధ్యాయులు మూతపడ్డాయి. ఆయా పాఠశాలల చిన్నారులు ప్రతి రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు కోసం నిరీక్షించి సాయంత్రం గృహాలకు వెళ్లిపోతున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మా స్కూళ్లకు మాస్టార్లను వేసి చదువు చెప్పమని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

గూడెంకొత్తవీధి మండలలోని పాఠశాల పునఃప్రారంభం నుంచి ఉపాధ్యాయులు లేక గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు లక్కవరం, పెద్ద అగ్రహారం, తడకపల్లి, పెబ్బంపల్లి, గొల్లపల్లి, గాలికొండ, డి.కొత్తూరు, బూసుకొండ, కుమ్మరపల్లి, కొంగపాకలు, పెట్రాయి, చెరుకుమల్లు, కమ్మరితోట, తోకరాయి మూతపడ్డాయి. అలాగే మండల పరిషత్‌ పాఠశాలలు సరమసింగారం, నేలజర్త, గుమ్మురేవులు, వర్తనపాడు, రుష్యగూడ, నారమామిడిగొంది, ధర్మాపురం, కొత్తవాడల్లో తెరుచుకోలేదు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ప్రతి ఏడాది సీఆర్‌టీలను నియమించేవారు. ఈ ఏడాది సీఆర్‌టీలను సైతం నియమించలేదు. మండల పరిషత్‌ పాఠశాలలకు పొరుగు పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌ పద్ధతిలోనూ ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఈ 22 పాఠశాలల్లో ఆదివాసీ విద్యార్థులు విద్యకు దూరం కావాల్సి వస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రులు మండల పరిషత్‌, విద్యాశాఖ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన కరువైంది. నూతన డీఎస్సీ నియామకాలు జరిగే వరకు పాఠశాలలకు ఉపాధ్యాయులు వచ్చే పరిస్థితి లేదని విద్యాశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారే తప్ప డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను నియమించడం లేదు. అయితే గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లోనున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను నూతన నియామకాలు జరిగే వరకు డిప్యూటేషన్‌ పద్ధతిలో నియమిస్తే తాత్కాలికంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. విద్యా శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ దిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఉపాధ్యాయుడు లేని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. అయితే విద్యర్థులు విద్యాబోధన జరగడం లేదు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుడు లేని 22 పాఠశాలల్లో విద్యాభోధన నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:04 AM