భోజనం బిల్లులకు మోక్షం
ABN , Publish Date - May 23 , 2025 | 12:52 AM
పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఊరట లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పెండింగ్‌లో వున్న బిల్లులు, వంట కార్మికుల వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బిల్లుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం, గురువారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో భోజన పథకం నిర్వాహకులు, వంట కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు క్లియర్
వంట కార్మికుల వేతన బకాయిలు కూడా విడుదల
భోజనాల బిల్లులు రూ.6.5 కోట్లు
కార్మికుల వేతన బకాయిలు రూ.2.88 కోట్లు
చోడవరం, మే 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఊరట లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు పెండింగ్‌లో వున్న బిల్లులు, వంట కార్మికుల వేతన బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బిల్లుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం, గురువారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో భోజన పథకం నిర్వాహకులు, వంట కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రాఽథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. భోజన పథకం నిర్వాహకులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.5.53, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.8.45 చొప్పున ప్రభుత్వం ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు మాత్రమే సరఫరా చేస్తుంది. కూరగాయలు, పప్పుదినుసులు, వంటగ్యాస్ ఖర్చును నిర్వాహకులు భరించాలి. వంట చేసే కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నది. ప్రతి నెలా విద్యార్థుల హాజరునుబట్టి భోజన పథకం నిర్వాహకులు సంబంధిత హెచ్‌ఎంల ద్వారా బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. సుమారు నెల రోజుల వ్యవధిలోనే బిల్లులు మంజూరవుతుంటాయి. కానీ గత విద్యా సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు బిల్లులు క్లియర్ కాలేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు అయితే డిసెంబరు నుంచే బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం ముగిసే నాటికి జిల్లాలో రూ.6.5 కోట్ల భోజనం బిల్లులు, రూ.2.88 కోట్ల మేర వంట కార్మికుల గౌరవ వేతనాలు అందాల్సి వుంది. వీటి కోసం సుమారు నెల రోజుల నుంచి భోజన పథకం నిర్వాహకులు, కార్మికులు ఎదురు చూస్తున్నారు. నిధులు విడుదల చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం గురువారం నిధులు విడుదల చేసింది. ఇవి వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. దీంతో భోజన పథకం నిర్వాహకులు, వంట కార్మికులు ఊరట చెందారు.
చాలా సంతోషం
గూనూరు వరలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు
పాఠశాలల భోజన పథకం పెండింగ్ బిల్లులు మంజూరు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు చేసి భోజనం వండాల్సి రావడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయి. దీంతో మాకు మిగిలేది ఏమీ ఉండడంలేదు. ఎట్టకేలకు విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా బకాయిలు రావడం సంతోషంగా ఉంది.