Share News

కాఫీ ఎకో పల్సింగ్‌ యూనిట్‌లకు మోక్షం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:16 PM

గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండల కేంద్రాల్లో ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కాఫీ ఎకో పల్సింగ్‌ యూనిట్‌లకు మోక్షం
అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తున్న జీకేవీధి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌

అసంపూర్తిగా ఉన్న జీకేవీధి, జి.మాడుగుల యూనిట్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

రూ.7 కోట్ల నిధులు విడుదల చేస్తూ గిరిజన సంక్షేశాఖ జీవో విడుదల

పది రోజుల్లో ప్రారంభంకానున్న పనులు

చింతపల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి, జి.మాడుగుల మండల కేంద్రాల్లో ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందు కోసం రూ.7 కోట్ల నిధులను విడుదల చేస్తూ గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్‌ జీవోను విడుదల చేశారు. మరో పది రోజుల్లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్‌ తరహాలో జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోనూ ఎకో పల్పింగ్‌ రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ కాఫీ పల్పింగ్‌ యూనిట్‌ల నిర్మాణాలకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో ఐదేళ్లుగా అవి మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. జీకేవీధిలో ఎకో పల్పింగ్‌ యూనిట్‌ కోసం కొనుగోలు చేసిన యంత్రాలు సైతం తుప్పుపడుతున్నాయి. ఈ మేరకు ఎకో పల్పింగ్‌ యూనిట్ల తాజా పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ‘కలగానే కాఫీ పల్పింగ్‌ యూనిట్‌’ శీర్షికన ఈ నెల 6న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించి ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల అంచనా విలువతో గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఈ నెల 9న చింతపల్లి, పాడేరులో పర్యటించిన గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి ఎంఎం నాయక్‌ అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న జీకేవీధి, చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒక్కొక్క పల్పింగ్‌ యూనిట్‌కు రూ.3.5 కోట్లు చొప్పున నిధులను మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమశాఖ శనివారం జీవోను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీకేవీధి, జి.మాడుగుల కాఫీ ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామని, నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. ఈ ఎకో పల్పింగ్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తే ఆదివాసీ రైతులు కాఫీ పల్పింగ్‌ కోసం ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు, ఖర్చులు తగ్గనున్నాయి.

Updated Date - Dec 28 , 2025 | 11:16 PM