Share News

అటకెక్కిన పోలీసు అవుట్‌ పోస్టు

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:03 PM

ఆంధ్ర కశ్మీరుగా గుర్తింపు పొందిన లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక సీజన్‌లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజులు, వీకెండ్‌లో ఈ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది.

అటకెక్కిన పోలీసు అవుట్‌ పోస్టు
పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు కోసం మూడేళ్ల క్రితం తాజంగిలో రెవెన్యూ, పోలీసు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నప్పటి దృశ్యం

తాజంగిలో ఏర్పాటుకు మూడేళ్ల క్రితం పోలీసుశాఖ ప్రతిపాదనలు

పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం

లంబసింగిలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య

మందుబాబులు, ఆకతాయిల ఆగడాలతో ఇబ్బందులు

పర్యాటకులకు తప్పని అవస్థలు

చింతపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీరుగా గుర్తింపు పొందిన లంబసింగికి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక సీజన్‌లో దేశ, విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజులు, వీకెండ్‌లో ఈ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది. దీని వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. కొందరు పర్యాటకులు మద్యం సేవించి హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022లో తాజంగిలో పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ప్రతిపాదనలు చేయడంతో రెవెన్యూశాఖ స్థలం కేటాయించింది. అయితే ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.

ప్రతి ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు లంబసింగికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. లంబసింగి వాతావరణం అత్యంత చల్లగా ఉంటుంది. దీంతో మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా డీజే సౌండ్స్‌ పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. దీని వలన స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎక్కడబడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో లంబసింగి జంక్షన్‌ వద్ద గంటల తరబడి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాగే పర్యాటకులు మార్గమధ్యంలో మద్యం సేవిస్తూ స్థానికులు, పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారు.

పోలీసు స్టేషన్‌ దూరంగా ఉండడంతో..

లంబసింగి, తాజంగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలు చింతపల్లి పోలీసు స్టేషన్‌కు 20- 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. టెంట్లు, రిసార్ట్స్‌పై పోలీసులు తరచూ దాడులు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంబసింగిలో రాత్రివేళ గస్తీ నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేకంగా సీఆర్‌పీఎఫ్‌ పోలీసు బెటాలియన్‌తో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ట్రాఫిక్‌ సమస్యను నియంత్రించేందుకు కూడా చింతపల్లి నుంచి పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు లంబసింగికి ఉదయం ఐదు గంటలకు వెళ్లాల్సి వస్తోంది. లంబసింగి, తాజంగి పర్యాటక ప్రాంతాలపై పోలీసు నిఘా ఉండడం లేదు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. మంచు అందాలను తిలకించాలని దేశ, విదేశాల నుంచి కుటుంబాలతో లంబసింగి వస్తున్న పర్యాటకులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రైవేటు రిసార్ట్స్‌ వద్ద అనధికారిక మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బ్రాండ్లు ఆధారంగా ఎంఆర్‌పీపై రూ.50- 100 అధిక ధరకు మద్యం సీసాలను పర్యాటకులకు విక్రయిస్తున్నారు. నిర్వాహకులకు రిసార్ట్స్‌, దుకాణాల వద్ద బెల్ట్‌షాపు తరహాలో విక్రయాలు చేపడుతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితమైన అవుట్‌ పోస్టు

లంబసింగిలో అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయాలనే అధికారుల సంకల్పం ప్రతిపాదనలకే పరిమితమైంది. పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక చర్యలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు గత కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని 2022 సెప్టెంబరులో అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. చింతపల్లి నుంచి పర్యాటక ప్రాంతాలైన తాజంగి, లంబసింగి ప్రాంతాలను పర్యవేక్షించడంపై ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ గత చింతపల్లి ఏఎస్పీ కె.ప్రతాప్‌ శివకిశోర్‌ సైతం పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో అవుట్‌ పోస్టు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తాంజగి ప్రాంతంలో అవుట్‌ పోస్టు నిర్మాణానికి 20 సెంట్ల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారుల ప్రతిపాదనలను పెడచెవిన పెట్టడంతో నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి లంబసింగి ప్రాంతంలో పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోయి శాంతి భద్రతలు చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదని ఈ ప్రాంత ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:03 PM