గజానికో గొయ్యి!
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:12 AM
మండలంలోని అసకపల్లి- లంకెలపాలెం రోడ్డులో ప్రయాణం దుర్లభంగా మారింది. ముఖ్యంగా అసకపల్లి నుంచి పైడివాడఅగ్రహారం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మొత్తం ఛిద్రమైంది. ఈ రోడ్డులో పరవాడ, సబ్బవరం మండలాలతోపాటు ఇతర మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలుచోట్ల భారీ గోతులు ఏర్పడడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యాన్లు పాడైపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
అసకపల్లి- పైడివాడఅగ్రహారం మధ్య దుర్లభంగా మారిన ప్రయాణం
భారీ గోతులతో పాడైపోతున్న వాహనాలు
రహదారిని పూర్తిస్థాయిలో పటిష్ఠం చేయాలని ప్రజల వినతి
వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు చేపడతామని అధికారులు వెల్లడి
సబ్బవరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అసకపల్లి- లంకెలపాలెం రోడ్డులో ప్రయాణం దుర్లభంగా మారింది. ముఖ్యంగా అసకపల్లి నుంచి పైడివాడఅగ్రహారం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మొత్తం ఛిద్రమైంది. ఈ రోడ్డులో పరవాడ, సబ్బవరం మండలాలతోపాటు ఇతర మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలుచోట్ల భారీ గోతులు ఏర్పడడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, వ్యాన్లు పాడైపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా.. గోతుల్లో నీరు చేరి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. రవాణా వాహహనాలు బోల్తాపడడం, గోతుల్లో కూరుకుపోవడం వంటి సందర్భాలు కూడా వున్నాయి. రాత్రిపూట ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరమని ద్విచక్ర వాహనదారులు అంటున్నారు. వైసీపీ హయాంలో విశాఖపట్నం- రాయపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనుల కోసం పరవాడ ఎన్‌టీపీసీ నుంచి ఫ్లైయాష్ (బూడిద)ను భారీ వాహనాల్లో ఈ మార్గం ద్వారానే రవాణా చేశారు. వీటి కారణంగానే రహదారి ధ్వంసం అయ్యిందని, అయినా సరే అప్పటి పాలకులు పట్టించుకోలేదని ఈ రోడ్డులో ప్రయాణించే పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు చొరవ తీసుకుని, ఎన్‌టీపీసీ నుంచి సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయించారు. దీంతో గత మార్చిలో లంకెలపాలెం నుంచి పైడివాడఅగ్రహారం వరకు రహదారికి నిర్వహణ పనులు చేశారు. అక్కడి నుంచి అసకపల్లి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారిపై ఏర్పడిన గోతులను మెటల్, క్రషర్ బుగ్గితో కప్పారు. అయితే గత పక్షం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో క్రషర్ బుగ్గితోపాటు మెటల్ కూడా కొట్టుకుపోయి, గోతులు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి.
రూ.2 కోట్లు మంజూరు
బాలరాజు, ఏఈ, ఆర్‌అండ్‌బీ
అసకపల్లి నుంచి పైడివాడఅగ్రహరం వరకు మూడు కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పనులు చేయడానికి వీలుకాదు. త్వరలోఓ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వర్షా కాలం ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.