Share News

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:39 PM

మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు.

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో నారాయణమూర్తి

చింతపల్లిలో ఆ దిశగా చర్యలు

గ్రావిటీ పథకం ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక

జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి

చింతపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. బుధవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న సీపీడబ్ల్యూ పథకం, జిల్లా పరిషత్‌ అతిథి గృహం, సంపద కేంద్రాలను పరిశీలించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చింతపల్లి మేజర్‌ పంచాయతీలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వేసవిలో సీపీడబ్ల్యూ పథకానికి నీటి సరఫరా చేస్తున్న బావులు ఎండిపోవడం వల్ల నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పారన్నారు. ఈ మేరకు పంచాయతీ ప్రజలకు అన్ని కాలాల్లోనూ పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేసేందుకు గ్రావిటీ పథకాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. చింతపల్లికి సమీపంలో ఉన్న బుడతలవేనం గ్రామంలో పుష్కలంగా జల వనరులు ఉన్నాయన్నారు. ఈ నీటిని గ్రావిటీ పథకం ద్వారా చింతపల్లి ప్రజలకు అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. గ్రావిటీ పథకం నిర్మాణానికి అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ కరుణను ఆదేశించామన్నారు. సాధ్యమైనంత త్వరగా గ్రావిటీ పథకాన్ని పంచాయతీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతీ సంపద కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజల నుంచి చెత్తను సేకరించి సంపద కేంద్రానికి తరలించాలన్నారు. సంపద కేంద్రంలో వర్మీ కంపోస్టు, కంపోస్టు ఎరువును ఉత్పత్తి చేసి పంచాయతీకి ఆదాయం సృష్టించాలని సూచించారు. చింతపల్లి జిల్లా పరిషత్‌ అతిథి గృహం ఆధునికీకరణకు రూ.20 లక్షల జడ్పీ నిధులు విడుదల చేశామన్నారు. అతిథి గృహానికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. పనులను నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. అతిథి గృహం ఆవరణలో రూ.40 లక్షల ఎంపీ నిధులతో సామాజిక భవనం నిర్మిస్తామన్నారు. అనంతరం చింతపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి ఉద్యోగులు సమయపాలన పాటించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు, పీఆర్‌ ఏఈ ఈ బాలకిశోర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈలు గడుతూరి స్వర్ణలత, కల్యాణ్‌రామ్‌ ఉన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:39 PM