Share News

భయం గుప్పిట...

ABN , Publish Date - Aug 29 , 2025 | 01:13 AM

నగరంలో కురుస్తున్న వర్షాలు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కంటికి నిద్రను దూరం చేస్తున్నాయి.

భయం గుప్పిట...

గత ఏడాది కొండవాలు ప్రాంతాలపై జీవీఎంసీ అధికారులు చేపట్టిన సర్వే వివరాలు

మొత్తం కాలనీలు - 135

నివాసిత కుటుంబాలు- 14,431

తీవ్రమైన ముప్పు పొంచివున్న ప్రాంతాలు - 5

ఆ ప్రాంతాల్లో నివాసిస్తున్న కుటుంబాలు- 249

మధ్యస్థ ముప్పు పొంచివున్న ప్రాంతాలు- 89

----------------------------------------

కొండవాలు నివాసితుల్లో ఆందోళన

మూడు రోజులుగా వర్షాలు

నానిపోయి జారి పడుతున్న మట్టి పెళ్లలు, రాళ్లు

నగర పరిధిలోని ఐదు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు

ప్రమాదంలో 249 కుటుంబాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో కురుస్తున్న వర్షాలు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి కంటికి నిద్రను దూరం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాళ్లు, మట్టి జారిపోతాయనే ఆందోళన వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది. గత ఏడాది గోపాలపట్నం వద్ద కొండచరియలు జారి ఐదు ఇళ్లకు ప్రమాదం వాటిల్లింది. తాజాగా కల్లుపాకలు ప్రాంతంలో వర్షాలకు నానిపోయిన పోలీస్‌బ్యారెక్స్‌ గోడ అర్ధరాత్రి సమయంలో కూలిపోయింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో కొండవాలు ప్రాంత నివాసితులతోపాటు పాతభవనాల్లో ఉంటున్న వారిలో గుబులు రేపుతోంది.

టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కల్లుపాకలు వద్ద పోలీస్‌ బ్యారెక్స్‌ ప్రహరీ కూలిపోవడంతో నగరంలో పురాతన భవనాలు, కొండవాలు ప్రాంతాల్లోని నివాసాల భద్రత చర్చనీయాంశంగా మారింది. ఆరిలోవ, విశాలాక్షి నగర్‌, పెదగదిలి, చినగదిలి, మధురవాడ వికలాంగుల కాలనీ, రిక్షా కాలనీ, హెచ్‌బీ కాలనీ దుర్గానగర్‌, కప్పరాడ, కైలాసపురం, వెంకోజీపాలెం, మురళీనగర్‌, కప్పరాడ, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక, మల్కాపురం తదితర ప్రాంతాల్లో కొండవాలులో వేలాది మంది నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్నారు. భారీవర్షాలు కురిసిన ప్రతిసారీ ఎక్కడోఒకచోట కొండచరియలు విరిగిపడడం, మట్టిపెళ్లలు జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సుమారు తొమ్మిదేళ్ల కిందట భారీవర్షం కారణంగా కైలాసపురంలో రాత్రివేళ కొండచరియ విరిగి దిగువనున్న ఇంటిపై పడడంతో ముగ్గురు మృతిచెందారు. వెంకోజీపాలెం మెడికవర్‌ ఆస్పత్రి వద్ద వర్షానికి ఎత్తున ఉన్న మట్టిజారి దిగువన ఉన్న పూరిళ్లపై పడడంతో ఒకరు మృతిచెందారు. గత ఏడాది గోపాలపట్నం లక్ష్మీనగర్‌ వద్ద కొండవాలులో మట్టిజారిపోవడంతో ఐదు ఇళ్లు ప్రమాదానికి గురయ్యాయి.

భారీ వర్షాలతో ఆందోళన

తాజాగా అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండవాలు ప్రాంతాలన్నీ ఇప్పటికే నానిపోయి ఉండడంతో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికారులతో పాటు కొండవాలు నివాసితులు ఆందోళన చెందుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుగా రక్షణ గోడల నిర్మాణం, ప్రమాదంలో ఉన్న భవనాలను తొలగించడానికి జీవీఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా గత ఏడాది సర్వే నిర్వహించారు.

కొండవాలులో 14,431 కుటుంబాలు

నగరంలోని పలుప్రాంతాల్లోని కొండవాలు ప్రాంతాల్లో నివాసాలు, ప్రమాదం ముంగిట ఉన్న ప్రాంతాలపై జీవీఎంసీ, రెవెన్యూశాఖ అధికారులు ఈనెల రెండున ఒక సర్వే నిర్వహించారు. కొండవాలులో 135 కాలనీలు ఉన్నాయని, అందులో 14,431 కుటుంబాలు నివసిస్తున్నట్టు గుర్తించారు. కొండవాలు ప్రాంతాల్లో అనకాపల్లి జోన్‌లోని ఇందిరమ్మకాలనీ, బీసీ కాలనీ-1, బీసీ కాలనీ-2, పాస్టర్‌ కాలనీతోపాటు జోన్‌-2 పరిధిలోని హనుమంతవాక కాలనీలు ప్రమాదం ముంగిట ఉన్నట్టు గుర్తించారు. ఈ ఐదు కాలనీల్లో 249 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారిని ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించడం వల్ల భవిష్యత్తులో ప్రాణనష్టాన్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. కొండవాలులో ఉన్న కాలనీల్లో మధ్యస్థ ప్రమాదం ముంగిట మరో 89 కాలనీలు ఉన్నట్టు గుర్తించారు.

పురాతన భవనాలపై చర్యలేవీ?

మరోవైపు నగరంలో పురాతన భవనాలను గుర్తించే పనిలో జీవీఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. జోన్లు వారీగా జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలతో పురాతన భవనాలను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నగరంలో సుమారు 400 పురాతన భవనాలు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఎక్కువగా పాతనగరంలో 90 భవనాలు పురాతనమైనవిగా గుర్తించారు. భీమిలి జోన్‌లో 15, జోన్‌-2 పరిధిలో 50, జోన్‌-3 పరిధిలో 30, జోన్‌-5 పరిఽధిలో 50 వరకు గుర్తించారు. పురాతన భవనాలుగా నిర్ధారించాలంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టక్చ్రరల్‌ ఇంజనీర్లు భవనాన్ని సందర్శించి సిమెంట్‌, కాంక్రీట్‌, ఐరన్‌ పటిష్ఠత నిర్ధారించేందుకు శాంపిళ్లు తీసి, ల్యాబ్‌లో పరీక్షిస్తారు. ఇందుకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చవగా, పురాతన భవనమని నిర్ధారణ అయితే దానిని కూల్చివేయడం, డెబ్రిస్‌ను తరలించడానికి మరో రూ.రెండు, మూడు లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతో అంత మొత్తం ఖర్చు పెట్టలేక అధికారులు మొక్కుబడిగా నివాసితులకు నోటీసు ఇచ్చి వదిలేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు సర్వేతో సరిపెట్టకుండా కొండవాలు, పురాతనభవనాలపై శాశ్వత చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

Updated Date - Aug 29 , 2025 | 01:14 AM