Share News

అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:30 AM

జిల్లాలో ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఖరారైంది.

అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం

తుది నోటిఫికేషన్‌ విడుదల

జిల్లాలో మూడుకు పెరగనున్న రెవెన్యూ డివిజన్లు

అనకాపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు ఖరారైంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. జిల్లాలో ప్రస్తుతం అనకాపల్లి, నర్సీపట్నం కేంద్రాలుగా రెవెన్యూ డివిజన్లు వున్నాయి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఐదు లేదా ఆరు లక్షల మంది జనాభాకు ఒక రెవెన్యూ డివిజన్‌ వుండాలని ప్రభుత్వం భావించింది. జిల్లాలో 17,26,998 మంది జనాభా వున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి డివిజన్‌లో 12 చొప్పున మండలాలు వున్నాయి. పాయరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని భావించింది. తొలుత నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై సుమారు నెల రోజులపాటు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. పలువురి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిశీలించిన ప్రభుత్వం.. నక్కపల్లికి బదులు ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో మునగపాక మండలాన్ని నక్కపల్లి డివిజన్‌లో చేర్చారు. అయితే వివిధ కారణాల వల్ల దీనిని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలమంచిలి నియోజకవర్గంలోని మిగిలిన మూడు మండలాలు, పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. మొత్తం ఏడు మండలాలతో అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానున్నది. ఇదే సమయంలో ఇప్పటి వరకు నర్సీపట్నం డివిజన్‌లో వున్న చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్‌కు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

అభివృద్ధికి ఊతం: మంత్రి అనిత

ఎస్‌.రాయవరం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో పాయకరావుపేట నియోజకర్గం అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపిన తరువాత ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పరిపాలనా సౌలభ్యం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 30 , 2025 | 01:30 AM