పీఎంశ్రీతో స్కూళ్లకు కొత్త రూపు
ABN , Publish Date - May 31 , 2025 | 12:51 AM
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎంపిక చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలలను ఎంపిక చేశారు. రూ.9 కోట్లతో అంచనాలతో పనులు చేపట్టారు. ఇందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం భరించాల్సి ఉంటుంది. జిల్లాలో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. జూన్ రెండో వారంలో స్కూళ్లు తెరిచేనాటికి పనులు పూర్తి చేయించడానికి జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు కృషి చేస్తున్నారు.
జిల్లాలో మూడు విడతల్లో 40 పాఠశాలలు ఎంపిక
రూ.9 కోట్ల అంచనాతో పనులు ప్రారంభం
అదనపు వసతి, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, కిచెన్ గార్డెన్లు ఏర్పాటు
భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు
చివరి దశలో పనులు.. స్కూళ్లు తెరిచేనాటికి పూర్తి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎంపిక చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలలను ఎంపిక చేశారు. రూ.9 కోట్లతో అంచనాలతో పనులు చేపట్టారు. ఇందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం భరించాల్సి ఉంటుంది. జిల్లాలో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. జూన్ రెండో వారంలో స్కూళ్లు తెరిచేనాటికి పనులు పూర్తి చేయించడానికి జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు కృషి చేస్తున్నారు.
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రత్యేక చొరవతో జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద తొలి విడతలో 24, రెండో విడతలో 11, మూడో విడతలో ఐదు.. మొత్తం 40 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద జిల్లాకు రూ.7.4 కోట్లు విడుదలయ్యాయి. ఆయా పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి పాఠశాలల్లో సైన్స్ విద్యార్థుల కోసం ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రయోగశాలకు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు కేటాయించారు. ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి రూ.1.5 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ల్యాబ్‌కు 10 డెస్క్‌టాప్ కంప్యూటర్లు అందించనున్నారు. అన్ని పాఠశాలల్లో వర్షపు నీటిని సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో కిచెన్ గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పండించే కూరగాయలను విద్యార్థుల భోజనం కోసం వినియోగిస్తారు. బాలబాలికల విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లకు మరమ్మతు పనులు చేపట్టారు. పాఠశాలల నిర్వహణ కోసం ద్యార్థుల సంఖ్యను బట్టి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నిధులు ఇవ్వనున్నారు.
ప్రైవేటుకు దీటుగా వసతులు
డాక్టర్ ఆర్.జయప్రకాశ్, ఏపీసీ, సమగ్ర శిక్ష 30ఏకేపీ.5.
పీఎంశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఆధునిక బోధనోపకరణాలను సమకూర్చుతున్నాం. అవసరమైన చోట అదనపు గదుల నిర్మాణం, సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూన్‌లో పాఠశాలలు తెరిచేనాటికి పూర్తవుతాయి.