పంట కాలువలకు కొత్తరూపు
ABN , Publish Date - Jun 24 , 2025 | 01:51 AM
ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకుంటున్నది.
ఉపాధి పథకం కింద అభివృద్ధి చేయిస్తున్న ప్రభుత్వం
కాలువల్లో ముమ్మరంగా తుప్పలు తొలగింపు, పూడిక తీత పనులు
307 కి.మీ.లకుగాను ఇప్పటికే 307 కి.మీ.లమేర పూర్తి
పొలాలకు సాఫీగా నీరు అందుతుందని అన్నదాతలు ఆనందం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకుంటున్నది. కూలీలకు పనులు కల్పించడమే కాకుండా రైతులకు ఉపయోగపడే పలురకాల పనులు చేయిస్తున్నది. పశువులకు నీడ కోసం గోకులం షెడ్డులు, పశువులకు నీటి కోసం సిమెంటు తొట్టెల నిర్మాణం, మెట్ట భూములకు నీటి కోసం పంటకుంటల తవ్వకం వంటి పనులు చేయించింది. వీటికన్నా ఎంతో ముఖ్యమైనది పంట కాలువల్లో తుప్పలు తొలగించి, పూడిక తీత పనులు చేపట్టడం. జిల్లాలో 361 కిలో మీటర్లమేర పంట కాలువల్లో పూడిక తీయించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 307 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. పంట కాలువలకు నీటిని విడుదల చేసేలోపు మిగిలిన పనులు పూర్తవుతాయని డ్వామా అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో సాగునీటి వనరుల నిర్వహణను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వాయర్లు, చెక్‌డ్యాములు, చెరువుల పంట కాలువల్లో పూడిక పేరుకుపోయి, తుప్పలు పెరిగిపోయి నీరు సరిగా ప్రవహించేది కాదు. ఈ కారణంగా ఆయకట్టుకు నీరు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధి హామీపథకం కింద అయినా కాలువల్లో పూడికలు తీయించాలన్న రైతుల వినతిని నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే అప్పటికే వర్షాకాలం, ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడానికి సమయం లేకపోయింది. దీంతో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు ఖరీఫ్ వరి సాగు పూర్తయి, కాలువలు ఎండిన తరువాత ఉపాధి హామీ పథకం కింద కూలీలతో తుప్పలు తొలగింపు, పూడికతీత పనులు మొదలుపెట్టారు. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన జాబితా మేరకు జిల్లాలో 361 కిలోమీటర్ల పొడవున పంట కాలువల్లో తుప్పలు తొలగింపు, పూడిక తీత కోసం 286 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 15వతేదీ నాటికి 307 కిలోమీటర్ల పొడవున కాలువల్లో పూడికత తీశారు. మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రోజూ సుమారు 40 వేల మంది ఉపాధి కూలీలు ఈ పనుల్లో పాల్గొంటున్నట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయితే కాలువల నుంచి పొలాలకు సాఫీగా నీరు అందుతుందని అన్నదాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.