Share News

నగరంలో నవ రత్నం

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:03 AM

నౌకా నిర్మాణంతో విజయవంతంగా ఆరంభమైన ప్రయాణం కడలి కెరటంలా పడినా మళ్లీ ఉవ్వెత్తున ఎగసింది.

నగరంలో నవ రత్నం

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు మినీ నవరత్న హోదా

కష్టాల కడలి నుంచి సమున్నత స్థాయికి

వందలాది నౌకా నిర్మాణాలు చేపట్టిన సంస్థ

మరమ్మతుల్లో ముఖ్యభూమిక పోషించిన వైనం

మల్కాపురం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):

నౌకా నిర్మాణంతో విజయవంతంగా ఆరంభమైన ప్రయాణం కడలి కెరటంలా పడినా మళ్లీ ఉవ్వెత్తున ఎగసింది. నౌకలు, సబ్‌మెరైన్ల నిర్మాణం, మరమ్మతుల్లో సరికొత్త రికార్డును సృష్టించి అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తాజాగా మినీ నవరత్న హోదాను సొంతం చేసుకుని సగర్వంగా నిలబడింది హిందుస్థాన్‌ షిప్‌యార్డు.

కేవలం మత్స్యసంపదకే పరిమితమైన విశాఖ సముద్ర తీరంలో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వాల్‌చంద్‌ హీరాచంద్‌ సింథియా స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీ పేరుతో 1941 జూన్‌ 21న నౌకా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి నౌక జల ఉషను విజయవంతంగా జలప్రవేశం చేశారు. ఆ తరువాత 1957లో సింథియా స్టీమ్‌ నావిగేషన్‌ కంపెనీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. అనంతరం వాణిజ్య నౌకలతో పాటు ప్రయాణికుల నౌకలు, టగ్‌లు, ఆయిల్‌ నౌకలు, సబ్‌మెరైన్లు, యుద్ధనౌకలను నిర్మించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. వివిధ కారాణాలతో 1980 దశకంలో నష్టాల బారినపడిన షిప్‌యార్డు, పడిలేచిన కెరటంలా విజృంభించింది. డ్రైడాక్‌ విభాగం నిర్మాణంతో అనేక నౌకలకు మరమ్మతులు చేపట్టడం ద్వారా లాభాల బాట పట్టింది.

నౌకా నిర్మాణంలో కీలకం

తూర్పు నౌకాదళం పక్కనే ఉన్న హిందుస్థాన్‌ షిప్‌ యార్డును కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ 2010లో రక్షణ రంగంలో విలీనం చేసింది. ఆ తరువాత ప్రధానంగా రక్షణ రంగానికి చెందిన అనేక భారీనౌకలు, సబ్‌మెరైన్‌లు, సింధుకీర్తి వంటి యుద్ధ నౌకలను నిర్మించి, నౌకా నిర్మాణ రంగంలో సమున్నత స్థాయికి చేరింది. ఈ ప్రక్రియలో భాగంగా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్‌షిప్‌లను రూపొందించే దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ లాభాలను చవిచూస్తూ తాజాగా మినీ నవరత్న హోదాను దక్కించుకుంది. ఈ హోదా రావడం పట్ల షిప్‌యార్డు ఉద్యోగ సంఘాలు, అధికార సంఘాలు, కాంట్రాక్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:03 AM