పాఠశాలలకు కొత్త కళ
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:19 PM
కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో భాగంగా జిల్లాలో 811 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న కొత్త టీచర్లు సోమవారం తమ జాయినింగ్ రిపోర్టులను సమర్పించి, పాఠశాలల్లో చేరారు.
జిల్లాలో 811 మంది కొత్త టీచర్ల నియామకం
జిల్లా పరిషత్ పరిధిలో 411 మంది, గిరిజన సంక్షేమ శాఖలో 400 మంది ఉపాధ్యాయులు
మెగా డీఎస్సీ నియామకాలపై సర్వత్రా హర్షం
పాడేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలో భాగంగా జిల్లాలో 811 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకున్న కొత్త టీచర్లు సోమవారం తమ జాయినింగ్ రిపోర్టులను సమర్పించి, పాఠశాలల్లో చేరారు.
జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్‌కు చెందిన పాఠశాలల్లో 231 మంది స్కూల్ అసిస్టెంట్‌లు, 220 మంది సెకండరీగ్రేడ్ టీచర్లు కాగా, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 65 మంది స్కూల్ అసిస్టెంట్‌లు, 335 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు కొత్తగా చేరారు. కొత్త టీచర్లు మండల విద్యాశాఖాధికారి, క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను సంప్రతించి తమ జాయినింగ్ రిపోర్టులను సమర్పించారు. అధిక సంఖ్యలో కొత్త టీచర్ల రాకతో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతున్నాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో మారుమూలనున్న ముంచంగిపుట్టు, జీకేవీధి, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాల్లో టీచర్లు లేక అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. తాజా నియామకాలతో ఇకపై ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు లేరనే సమస్య ఉత్పన్నం కాదని అధికారులు అంటున్నారు. అలాగే నూతన ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు సూచించారు. కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.