అంగన్‌వాడీలకు గూడు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:27 AM
జిల్లాలో అసంపూర్తిగా వున్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాల పెండింగ్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదే విధంగా అద్దె భవనాలు, పరాయి పంచన నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సొంత భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

జిల్లాలో 141 అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు
అద్దె ఇళ్లు, పరాయిపంచన నిర్వహిస్తున్న కేంద్రాలకు కూడా సొంత భవనాలు
మౌలిక వసతుల కల్పనకు నిధుల కోసం ప్రతిపాదనలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అసంపూర్తిగా వున్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాల పెండింగ్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదే విధంగా అద్దె భవనాలు, పరాయి పంచన నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సొంత భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
జిల్లాలో మొత్తం 1,908 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి. వీటిలో అత్యధికంగా 1,712 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో వుండగా, మిగిలిన 196 కేంద్రాలు జీవీఎంసీ అనకాపల్లి జోన్, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జిల్లాలో 881 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 411 కేంద్రాలు అద్దె భవనాల్లో, 616 కేంద్రాలు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో జిల్లాలో రెండు దశల్లో 629 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒక్కో భవనం అంచనా వ్యయం రూ.15 లక్షలు. ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అధికారులు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే కేంద్రం ప్రభుత్వం తన వాటా నిధులు విడుదలచేయగా, నాటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వలేదు. దీంతో భవన నిర్మాణాలు మందకొడిగా సాగాయి. పలు భవనాలు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. మొత్తం మీద 488 భవనాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. 141 భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. గత ఏడాది సాధారణ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం.. అసంపూర్తిగా వున్న భవనాలపై దృష్టి సారించింది.
వైసీపీ హయాంలో అసంపూర్తిగా నిర్మించిన భవనాలకు ఎంత ఖర్చుచేశారు, ఇంకా చేయాల్సిన పనులకు ఎంత ఖర్చు అవుతుంది, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఎంతమేర వున్నాయి వంటి వివరాలను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇప్పటికే మండలాల వారీగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.2.9 కోట్ల బకాయిలు వున్నట్టు అధికారులు గుర్తించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే.. మిగిలిన పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అసంపూర్తిగా వున్న భవనాలను పూర్తి చేయడంతోపాటు ఇంతవరకు సొంత భవనాలు లేని కేంద్రాలకు కూడా కొత్త భవనాలు నిర్మించాలని, ఇంకా ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. మౌలిక సదుపాయాల కోసం రూ.2 కోట్లు మంజూరు చేయాలని అధికారులు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో అసంపూర్తిగా వున్న అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం జిల్లా అధికారి వీరన్నాయుడు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామన్నారు.