Share News

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:11 AM

మండలంలోని విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద ఆదివారం ఉదయం టాటాఏస్‌ గూడ్స్‌ వాహనం అదుపుతప్పి తాచేరు గెడ్డ వైపునకు ఒరిగింది. అదృష్టవశాత్తూలో నీటిలో పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం, గూడ్స్‌ వాహనం డ్రైవర్‌ అనాలోచితంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా కాజ్‌వేపై సిమెంట్‌ మిక్చర్‌తో రోలింగ్‌ చేసి, ఆదివారం సాయంత్రం నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం
విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద పక్కకు ఒరిగిన టాటాఏస్‌ గూడ్స్‌ వాహనం.

విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద టాటా ఏస్‌ గూడ్స్‌ వాహనం బోల్తా

సురక్షితంగా బయటపడిన డ్రైవర్‌

ప్రమాదంతో స్పందించిన కాంట్రాక్టర్‌

సిమెంట్‌ మిక్చర్‌తో రోలింగ్‌ పనులు

అన్ని వాహనాల రాకపోకలకు అనుమతి

బుచ్చెయ్యపేట, అక్టోబరు 5 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట కాజ్‌వే వద్ద ఆదివారం ఉదయం టాటాఏస్‌ గూడ్స్‌ వాహనం అదుపుతప్పి తాచేరు గెడ్డ వైపునకు ఒరిగింది. అదృష్టవశాత్తూలో నీటిలో పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం, గూడ్స్‌ వాహనం డ్రైవర్‌ అనాలోచితంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా కాజ్‌వేపై సిమెంట్‌ మిక్చర్‌తో రోలింగ్‌ చేసి, ఆదివారం సాయంత్రం నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు.

ఆగస్టు రెండో వారంలో భారీ వర్షాలు పడి, తాచేరు గెడ్డకు వరద రావడంతో విజయరామరాజుపేట వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. అప్పటి నుంచి నదిలో వరద ప్రవాహం తగ్గకపోవడంతో పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. ఎట్టకేలకు వారం రోజుల క్రితం వరద ఉధృతి నెమ్మదించడంతో కాజ్‌వే పనులు మొదలుపెట్టారు. తొలుత సిమెంట్‌ పైపులు అమర్చి, వాటిపై గ్రావెల్‌ వేసి చదును చేశారు. రెండు రోజుల నుంచి ద్విచక్ర వాహనాలను, పాదచారులను రాకపోకలకు అనుమతించారు. సిమెంట్‌, మెటల్‌ మిక్చర్‌ వేసి, రోలింగ్‌ చేసిన తరువాత ఇతర వాహనాలను అనుమతిస్తామని అధికారులు చెప్పారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి సిమెంట్‌, మెటల్‌ మిక్చర్‌ తెచ్చి కుప్పలు పోశారు. ఆదివారం ఈ కుప్పలను సరిచేసి రోలింగ్‌ చేయాల్సి వుంది. అయితే ఆర్‌అండ్‌బీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌.. కాజ్‌వే మీదుగా ద్విచక్ర వాహనాలు కాకుండా మిగిలిన వాహనాలు వెళ్లకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆదివారం ఉదయం చోడవరం వైపు నుంచి వడ్డాది వైపు వస్తున్న టాటా ఏస్‌ గూడ్స్‌ వాహనం కాజ్‌వే మీదుగా వెళ్లడానికి డ్రైవర్‌ ప్రయత్నించాడు. సగభాగంలో సిమెంట్‌ మిక్చర్‌ వుండడంతో, మిగిలిన సగభాగంలో నుంచి వెళ్లే క్రమంలో మిక్చర్‌ కుప్పపైకి ఎక్కి నది ప్రవాహం వైపునకు ఒరిగిపోయింది. అయితే అదృష్టవశాత్తూ నీటిలో పడకపోవడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కాజ్‌వే కాంట్రాక్టర్‌.. వెంటనే కూలీలను రప్పించి సిమెంట్‌ మిక్చర్‌ కుప్పలను కాజ్‌వేపై పరిచి రోలింగ్‌ చేయించారు. ఆదివారం సాయంత్రానికి పనులు పూర్తికావడంతో అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. కాగా కాజ్‌వేకు ఇరుపక్కలా రక్షణ కోసం చిన్నపాటి కర్రలు పాతారు. రాత్రిపూట ఈ కర్రలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం వుంది. రేడియం స్టిక్కర్లతో ఇనుప రెయింగ్‌ బిగించి, లైట్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:12 AM