ముందుకుసాగని మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:20 AM
భోగాపురం విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు’గా ఉన్నాయి.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యేలోగా ఏడు రహదారుల నిర్మాణానికి ఏడాది క్రితం ప్రతిపాదనలు
ఇప్పటివరకూ ఒక్క అడుగు కూడా నిర్మించని వైనం
భూముల సేకరణలో అడ్డంకులే కారణం
ప్రత్యామ్నాయం ఆలోచించని అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భోగాపురం విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు’గా ఉన్నాయి. విమానాశ్రయం ప్రారంభించే నాటికి రహదారుల నిర్మాణం పూర్తి చేయాలనేది లక్ష్యం. వచ్చే జూన్‌లో విమానాశ్రయం ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటు చూస్తే కనీసం ఒక రహదారికి కూడా పూర్తిగా భూసేకరణ జరగలేదు.
భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం నగరం మధ్య నుంచి వెళ్లే ప్రధాన మార్గంలో ట్రాఫిక్ తగ్గించి, వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించడానికి వీఎంఆర్‌డీఏ ఏడాది క్రితం కొత్తగా 15 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి నడుం కట్టింది. ఆ తరువాత ఆచరణలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందు ఏడు రహదారులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో కొన్ని జీవీఎంసీ, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ నిర్వహణలో ఉన్నాయి. వారితో సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంది. ఈ ఏడు రహదారుల పొడవు 26.72 కి.మీ. కాగా నిర్మాణానికి రూ.175 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వీఎంఆర్‌డీఏలో ఈ బాధ్యతలను ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించారు.
భూసేకరణలో ఇబ్బందులు
ముందు ప్రతిపాదించిన మొత్తం 15 మాస్టర్ ప్లాన్ రహదారులకు వివిధ వర్గాల నుంచి 75 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని అధికారులు ప్రకటించారు. అందులో అసైన్డ్ భూములు, జిరాయితీ, అటవీ భూములు ఉన్నాయి. భూ సేకరణలో మూడు విధాలుగా పరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంది. మార్కెట్ రేటు ప్రకారం నగదు భూ యజమానుల ఖాతాలో జమ చేయడం ఒకటి. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సొమ్ము ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. భూమి విలువకు తగిన భూమిని మరోచోట ఇవ్వడం రెండో విధానం. దీనిపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించలేదు. ఇక మిగిలింది మూడోదైన టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్)లు. అంటే భూమి విలువ లెక్కించి అమ్ముకునేందుకు వీలుగా టీడీఆర్లు ఇవ్వడం. ఈ మార్గాల్లో 700 మంది నుంచి భూములు సేకరించాలని తేల్చారు. వారిలో 300 మంది మాత్రమే భూములు ఇవ్వడానికి, ప్రతిగా టీడీఆర్‌లు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ 300 మందిలో ఒక్కరంటే ఒక్కరు మాత్రమే టీడీఆర్ తీసుకోవడానికి అనుమతిస్తూ లేఖ సమర్పించారు. ఇది ప్రస్తుత పరిస్థితి.
అసలు విషయాలు చెప్పడం లేదు
భూసేకరణలో క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిపై లోతుగా చర్చ జరగడం లేదు. ప్రత్యామ్నాయాలు ఆలోచించడం లేదు. ఉత్తుత్తి సమీక్షా సమావేశాలు పెట్టుకొని నిర్దేశిత గడువులోగా వాటిని పూర్తిచేయాలని పాలకులు, ఉన్నతాధికారులు ఆదేశించడం, ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులు అలాగే అంటూ తలలు ఆడించడమే జరుగుతోంది. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు రహదారి కూడా ఇప్పటివరకూ నిర్మించలేదు. గుర్తించిన మార్గాల్లో కొంతమేరకు జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేశారు. అంటే తుప్పలు మాత్రమే కొట్టారు. ఈ ఏడాది కాలంలో జరిగిన పని అదొక్కటే.
విస్తరణ ప్రతిపాదిత రహదారులు...
1. అడవివరం బీఆర్‌టీఎస్ జంక్షన్ (శొంఠ్యాం రహదారి) నుంచి గండిగుండం వరకూ 180 అడుగుల మేర రహదారిని 8 కి.మీ. పొడవున వేయాల్సి ఉంది. దీని అంచనా వ్యయం రూ.40 కోట్లు. ఈ మార్గంలో అటవీ శాఖకు చెందిన భూమి కొంత తీసుకోవలసి ఉంది. ఇవ్వడానికి ఆ శాఖ అధికారులు అంగీకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఆ భూమిని ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావించిన ఈ మార్గానికే ఆటంకాలు ఎదురయ్యాయి.
2. ఆనందపురం జాతీయ రహదారి నుంచి గంభీరం రిజర్వాయర్ వరకూ 2.2 కి.మీ. రహదారిని ప్రతిపాదించారు.
3. జీవీఎంసీ 18వ వార్డులో శివశక్తి నగర్ నుంచి వుడా హరిత ప్రాజెక్టు వరకు 60 నుంచి 80 అడుగుల మేర 1.7 కి.మీ. రహదారిని విస్తరించాల్సి ఉంది. దీనికి నిర్మాణ వ్యయం రూ.7.65 కోట్లు
4. పరదేశిపాలెం నుంచి గంభీరం వరకూ 1.4 కి.మీ. రహదారిని 60 అడుగుల వెడల్పున విస్తరించాలని ప్రతిపాదించారు. దీని అంచనా వ్యయం రూ.5.04 కోట్లు.
5. నేరళ్లవలస నుంచి దొరతోట మీదుగా తాళ్లవలసకు 80 అడుగుల వెడల్పున 3.83 కి.మీ. రహదారి నిర్మించాలి. దీనికి రూ.24 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
6. బోయపాలెం జంక్షన్ నుంచి కాపులుప్పాడ వరకు మూడు కి.మీ. రహదారిని 100 అడుగులకు విస్తరించాల్సి ఉంది. తొలుత 6 కి.మీ.కు ప్రతిపాదించారు. ఆ తరువాత సగం తగ్గించేశారు. దీని అంచనా వ్యయం రూ.15 కోట్లు.
7. భీమిలి మండలంలో చిప్పాడ నుంచి విజయనగరం జిల్లా పోలిపిల్లి వరకూ 6.32 కి.మీ. రహదారిని 80 అడుగుల మేరకు విస్తరించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.37.92 కోట్లు అంచనా వ్యయం. దివీస్ యాజమాన్యం సహకరించడానికి ముందుకువచ్చింది.