దాతలకే మస్కా!?
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:08 AM
నగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్ అధినేతకే కనకమహాలక్ష్మి ఆలయ అధికారులు మస్కా కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కనకమహాలక్ష్మి ఆలయ సిబ్బందిపై విమర్శలు
అలాగైతే విరాళాలు ఎలా వస్తాయి
చర్చనీయాంశంగా ‘వెండి’ వ్యవహారం
విచారణకు నేరుగా కమిషనర్ నుంచే ఉత్తర్వులు
విశాఖపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్ అధినేతకే కనకమహాలక్ష్మి ఆలయ అధికారులు మస్కా కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మవారికి వెండి తాపడం కొత్తది చేయించి ఇస్తే, పాత వెండి ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా కనీసం ఒక్క గ్రాము కూడా ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా 60 కిలోల వెండి తాపడం తీసుకొని రశీదు కూడా ఇవ్వలేదు. ఇందుకు సంబంధించి ‘వెండిపై వివాదం’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం చర్చకు దారితీసింది. ఇలాగైతే దాతలు ఆలయానికి విరాళాలు ఇవ్వడానికి ముందుకువస్తారా?...అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆలయంలో విజయ దశమి సందర్భంగా అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తారు. ఒక రోజు కూరగాయలతో, మరో రోజు గాజులతో, ఇంకో రోజు లడ్డూలతో ఇలా అలంకరింస్తారు. వీటికి ఒక్కో రోజు ఒక్కో దాత విరాళం ఇస్తారు. వాటిలో కూడా తప్పుడు లెక్కలు చూపుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఒక ఏడాది గాజులకు రూ.25 వేలు తీసుకుంటే, మరుసటి ఏడాది అదే గాజులకు రూ.40 వేలు తీసుకున్నారని ఓ దాత బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. అదేవిధంగా ఆలయంలో నిర్వహించే హోమాలు, పూజలకు వస్తు సామగ్రి సమకూర్చాల్సిందిగా ఆలయ వర్గాలు కోరతాయని, వాటికి అయ్యే వ్యయం అంతా తామే పెట్టుకుంటామని, అలాంటి వాటికి కూడా రశీదులు ఇవ్వడం లేదని మరో దాత ఆరోపించారు. పెద్ద పెద్ద మొత్తాలు విరాళంగా ఇచ్చేవే పుస్తకాల్లో లెక్కలు చూపించకపోతే ఇక చిన్న చిన్నవి ఎన్ని మాయం అవుతున్నాయో ఎవరికి తెలుసు?...అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సిబ్బంది పనితీరు కొంత గందరగోళంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
నిబంధనలు పాటించరా..?
విరాళం కింద వంద రూపాయలు ఇచ్చినా, గ్రాము బంగారం ఇచ్చినా...దాతల ముందే దానిని తూకం వేసి పుస్తకంలో రాసి రశీదు ఇవ్వాలి. ఇది నిబంధన. అయితే ఏకంగా 60 కిలోల వెండితో తాపడం చేయిస్తే...ఆ వివరాలు పుస్తకాల్లో ఎక్కడా లేకపోవడం ఏమిటో అంతుబట్టడం లేదు. వాటి లెక్కలు అప్పగించకుండా ఇక్కడి నుంచి ఈఓ రిలీవ్ కావడం మరో విచిత్రం. ఆమె ఇటీవల రిటైర్ కావడం, అమెరికా వెళ్లిపోతుండడంతో ఎప్పుడు వస్తారో తెలియక...లెక్కలు తేల్చడానికి సిద్ధపడ్డారని తెలిసింది. 2021లో ఇదంతా జరిగిన తరువాత కాళింగరి శాంతి ఈఓగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు పనిచేశారు. సహజంగా ఆమె ఇలాంటి ఆభరణాల లెక్కల్లో కచ్చితంగా ఉంటారు. కానీ ఆమె కూడా ఈ విషయంలో ఎందుకనో మౌనం వహించారు. గత వారం ఈ లెక్కలు అప్పగింతకు వచ్చినప్పుడు ఆ కాగితాలపై సంతకాలు చేయడానికి ఆమె నిరాకరించారు. ఒకరి తరువాత మరొకరు పెట్టాల్సిందేనని అంతా చెప్పడంతో అయిష్టంగానే సంతకం చేశారు. అమెరికా వెళ్లిపోతున్న రిటైర్డ్ ఈఓ కూడా షాపింగ్‌మాల్ అధినేత ఎంత బరువైన తాపడం ఇచ్చారో సరిగ్గా లెక్క చెప్పకపోవడం వల్లనే రశీదు ఇవ్వలేదని వివరణ రాసి ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
కమిషనర్ నుంచే ఆదేశం: ఎన్.సుజాత, డిప్యూటీ కమిషనర్
కనకమహాలక్ష్మి ఆలయంలో వెండి లెక్కలపై విచారణ చేయాలని నేరుగా దేవదాయ శాఖ కమిషనర్ నుంచే ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై విచారణ చేయాల్సి ఉంది. పాత వెండి ఆభరణాలు ఇచ్చి, కొత్త వెండి ఆభరణాలు తీసుకోవడానికి కమిషనర్ అనుమతి తప్పనిసరి. ఉన్నతాధికారులకు తెలియజేయకుండా, కనీసం ఫైల్ కూడా పెట్టకుండా ఇంత పెద్దమొత్తంలో వెండికి రశీదులు లేకపోవడం విచిత్రంగా ఉంది. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నాం.