Share News

ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలతో పెనుముప్పు

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:37 AM

ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలు(ఈ-వేస్టు) వల్ల మానవుల ఆరోగ్యానికి పెనుముప్పు కలుగుతుందని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ అన్నారు. శనివారం చింతపల్లిలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ-వేస్టు సేకరణ కేంద్రాన్ని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలతో పెనుముప్పు
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు

- సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం

- కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

- చింతపల్లిలో ఈ-వేస్టు సేకరణ కేంద్రం ప్రారంభం

చింతపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలు(ఈ-వేస్టు) వల్ల మానవుల ఆరోగ్యానికి పెనుముప్పు కలుగుతుందని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ అన్నారు. శనివారం చింతపల్లిలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ-వేస్టు సేకరణ కేంద్రాన్ని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యర్థాల వల్ల చాలా అనర్థాలు ఉన్నాయన్నారు. ప్రధానంగా జలవనరులు, నేలలు కలుషితమైపోయి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారన్నారు. ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను ప్రజలు పంచాయతీ సిబ్బందికి అప్పగిస్తే రీసైక్లింగ్‌ చేయిస్తారన్నారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ను ఏప్రిల్‌ ఒకటి నుంచి నిషేధించామని తెలిపారు. అయితే ప్రజలు ఇప్పటికి వాటిని ఉపయోగిస్తున్నారన్నారు. దీని వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయం ఉద్యోగులు అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో గిరిజన ప్రాంతంలో కేన్సర్‌ బాధితులు అరుదుగా ఉండేవారన్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 1200 మందిలో కేన్సర్‌ లక్షణాలు కనిపించగా, 36 మందిలో వ్యాధి నిర్థారణ జరిగిందన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల కేన్సర్‌ బాధితులు పెరుగుతున్నారన్నారు. ఈ-వేస్టు సేకరణ కేంద్రాలను తొలి విడతగా పెదలబుడు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. చింతపల్లి పంచాయతీలో పది వేలకు పైగా జనాభా వుండడంతో ప్రత్యేక గుర్తింపు కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. మేజర్‌ పంచాయతీ తరహాల్లో నిర్వహణ సాధ్యంకాదని, చింతపల్లికి ప్రత్యేక గుర్తింపు కల్పించి అదనపు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ మాట్లాడుతూ వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రజలందరూ పంచాయతీ సిబ్బందికి సహకరించాలన్నారు. వ్యర్థాలు సేకరించే సమయంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. ప్రజలు వ్యర్థాలను ఎక్కడబడితే అక్కడ పడేయరాదని, ఇళ్లల్లో భద్రపరిచి పంచాయతీ సిబ్బందికి అందజేయాలన్నారు. చింతపల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆమె కోరారు. అనంతరం ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ర్యాలీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, ఎంపీపీ కోరాబు అనుషదేవి, మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ దురియా పుష్పలత, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరంబాబు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీడీ లాలం సీతయ్య, ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ గడుతూరి స్వర్ణలత పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:37 AM