Share News

మావోయిస్టులకు గట్టి దెబ్బ

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:40 PM

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలోని మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, అతని భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడకం రాజేతో పాటు మరో నలుగురు సభ్యులు మృతి చెందడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

మావోయిస్టులకు గట్టి దెబ్బ
మడివి హిడ్మా(ఫైల్‌)

మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కాల్పుల్లో అగ్ర నేతలు హిడ్మా, రాజేతో పాటు మరో నలుగురు మృతి

హిడ్మా తలపై రూ.కోటి, రాజేపై రూ.50 లక్షల రివార్డు

ఏవోబీతో పాటు ఛత్తీస్‌గఢ్‌తోనూ ఉనికి కోల్పోతున్న ఉద్యమం

జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు

పాడేరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలోని మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, అతని భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడకం రాజేతో పాటు మరో నలుగురు సభ్యులు మృతి చెందడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా సంఘటనా స్థలంలో రెండు ఏకే47 రైఫిల్స్‌, ఒక పిస్టల్‌, ఒక రివాల్వర్‌, ఒక సింగిల్‌ బార్‌ తుపాకీ, 28 ఏకే47 బుల్లెట్లు, 5 పిస్టల్‌ బుల్లెట్లు, ఇతర పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయని పోలీసులు ప్రకటించారు.

ఫలించిన పోలీసుల వ్యూహం

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపుల నేపథ్యంలో మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. దీంతో ఇదే అదనుగా వారిని మట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మాటేశాయి. తాజా పరిస్థితులను గమనించిన పోలీసులు... మావోయిస్టులు తమకు చిక్కేలా వ్యూహం రచించారు. ఛత్తీస్‌గఢ్‌ను వీడి సేఫ్‌ జోన్‌ కోసం వెతుకులాడుతున్న మావోయిస్టులు అంతగా పోలీసుల హడావిడి లేని మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఆశ్రయించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాష్ట్రంలో, దేశంలో ఏయే ప్రాంతాలకు మావోయిస్టులు తరలుతున్నారని గత రెండు నెలలుగా పోలీసు వర్గాలు నిఘా పెట్టాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి బయటకు వచ్చి మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చారని పక్కాగా సమాచారం సేకరించిన పోలీసులు గ్రేహౌండ్స్‌ బలగాలతో ఆయా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా(45), అతని భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడకం రాజే(40)తో పాటు డివిజన్‌ కమిటీ సభ్యులుగా ఉన్న లక్మల్‌ అలియాస్‌ చైతు(35), దేవ్‌(36), మల్ల అలియాస్‌ మల్లాలు(35), కమ్లు అలియాస్‌ కమలేష్‌(36) మృతి చెందారని పోలీసులు ధ్రువీకరించారు.

ఉనికి కోల్పోతున్న ఉద్యమం

మావోయిస్టు ఉద్యమానికి పెట్టని కోటగా ఉండే ఛత్తీస్‌గఢ్‌తో పాటు సురక్షిత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆ పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతున్నది. ముఖ్యంగా 2016 అక్టోబరు 24న మల్కన్‌గిరి జిల్లా రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ, మల్కన్‌గిరి, కొరాపుట్‌ ఏరియా కమిటీ, ఏవోబీ కటాఫ్‌ ఏరియా కమిటీ, కోరుకొండ, పెదబయలు, గాలికొండ ఏరియా కమిటీలతో పాటు వాటి కిందన మరో ఆరు (లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌) ఎల్‌జీఎస్‌ దళాలుండేవి. క్రమంగా అవన్నీ పోయి ఆఖరికి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీ మాత్రమే మిలిగింది. దాని ద్వారానే ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ గత మూడేళ్లుగా పోలీసుల నిర్బంధం పెరగడంతో పాటు ఈ ఏడాది జూన్‌లో మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి, సభ్యులైన అరుణ, అంజు సైతం మృతి చెందడంతో ఏవోబీలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. అలాగే ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఏవోబీకి సరిహద్దులో ఉండే ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ప్రత్యేక కేంద్ర పోలీసు బలగాల గాలింపులు, కాల్పుల ప్రభావంతో అనేక మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా, వందల సంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. ఈ క్రమంలో దండకారణ్యంపై పోలీసు బలగాలు పట్టుసాధించాయి. దీంతో తలదాచుకోవడమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, వివిధ జిల్లాల్లో ఉన్న పదుల సంఖ్యలోని మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అప్రమత్తం

సీలేరు: మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్ర నేతలు హిడ్మా, రాజీ తదితరులు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన నేపథ్యంలో ఏవోబీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనలో మరికొంతమంది తప్పించుకున్నారని నిఘా వర్గాల హెచ్చరికతో సరిహద్దుల్లోని సీలేరు, డొంకరాయి, మోతుగూడెం, జీకేవీధి పోలీసులతో పాటు ఒడిశాలోని పలు పోలీస్‌ స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:40 PM