మావోయిస్టులకు గట్టి దెబ్బ
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:31 AM
మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. జిల్లాలోని మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్ పరిధి దేవీపట్నం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలైన గాజర్ల రవి, అరుణ, అంజు మృతి చెందడంతో మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దేవీపట్నం అడవుల్లో పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేతలు గాజర్ల రవి, అరుణ, అంజు మృతి
ఏవోబీలో ఉనికి కోల్పోతున్న ఉద్యమం
పాడేరు, జూన్ 18(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది. జిల్లాలోని మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్ పరిధి దేవీపట్నం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నేతలైన గాజర్ల రవి, అరుణ, అంజు మృతి చెందడంతో మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మావోయిస్టు ఉద్యమానికి పెట్టని కోటగా ఉండే ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఆ పార్టీ క్రమంగా ఉనికిని కోల్పోతున్నది. ముఖ్యంగా 2016 అక్టోబరు 24న మల్కన్‌గిరి జిల్లా రామ్‌గూడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాకూరు వెంకటరమణ అలియాస్ గణేశ్ మృతి చెందారు. అప్పటి నుంచి మొదలు క్రమంగా ఏవోబీలో ఉద్యమం క్షీణిస్తూ వస్తున్నది. సీనియర్ నేతలు కాల్పుల్లో మృతి చెందడం, కొత్త తరం ఉద్యమంలోకి రాకపోవడంతో క్రమంగా ఉద్యమం బలహీనమైంది. గతంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈస్ట్ డివిజన్ కమిటీ, మల్కన్‌గిరి, కోరాపుట్ ఏరియా కమిటీ, ఏవోబీ కటాఫ్ ఏరియా కమిటీ, కోరుకొండ, పెదబయలు, గాలికొండ ఏరియా కమిటీలతో పాటు వాటి కిందన మరో ఆరు (లోకల్ గెరిల్లా స్క్వాడ్) ఎల్‌జీఎస్ దళాలుండేవి. క్రమంగా అవన్నీ పోయి ఆఖరికి ఆంధ్ర, ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ మాత్రమే మిలిగింది. దాని ద్వారానే ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ గత మూడేళ్లుగా పోలీసుల నిర్బంధం పెరగడంతో ఒడిశా, ఆంధ్రాలో సైతం మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో కమిటీలో ఉన్న కార్యదర్శి గాజర్ల రవి, సభ్యులైన అరుణ, అంజు సైతం పోలీసుల కాల్పుల్లో మృతి చెందడంతో ఏవోబీలో ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒకప్పుడు మావోయిస్టులకు ఏవోబీ కంచుకోట
సీలేరు: ఒకప్పుడు ఏవోబీ మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. మావోయిస్టు అగ్ర నాయకులు, కీలక నేతలంతా ఏవోబీనే షెల్టర్‌గా చేసుకుని ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ర్టాల్లో తమ కార్యకలాపాలను, వివిధ సంఘనలకు వ్యూహాలను కొనసాగించేవారు. పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీలో విలీనమైన తరువాత 1990 నుంచి 2016 వరకు ఏవోబీలో మావోయిస్టులదే పైచేయిగా ఉండేది. ఏవోబీలో మారుమూల గ్రామాల గిరిజనులను వివిధ రకాల అభివృద్ధి పేరిట మావోయిస్టులు మచ్చిక చేసుకుని మనుగడ కొనసాగించేవారు. దీంతో ఏవోబీలో పోలీసు బలగాలు అడుగుపెట్టాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. 2008 జూన్ 28న బలిమెల లాంచీ ఘటన దేశంలోనే సంచనలమైంది. ఈ సంఘటనలో ఆంధ్రాకు చెందిన 30 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది జల సమాధి అయిపోయారు. దీంతో ఆంధ్రాలోని గ్రేహౌండ్స్ యూనిట్ మొత్తం కోల్పోవడంతో కొన్ని సంవత్సరాల పాటు పోలీస్ కూంబింగ్ నిలిచిపోయింది. అలాగే 2011లో మల్కన్‌గిరి కలెక్టర్‌ను ఏవోబీలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనమైంది. మావోయిస్టు కీలక నాయకులు ఆర్కే, నంబాల కేశవరావు, ఆజాద్, చలపతి, గాజర్ల రవి, కృష్ణ, కుడుముల రవి, నవీన్, అరుణ, పిల్లి వెంకటేశ్వరులు, లోతా తమ్మారావు వంటి వారు వివిధ ప్రాంతాలకు చెందిన వారైనప్పటికీ ఏవోబీ నుంచి కీలక నేతలుగా ఎదిగారు. ఇక్కడ నుంచే 2015 వరకు వివిధ రకాల వ్యూహ రచనలు చేశారు. అనకాపల్లి , చోడవరం పోలీస్ స్టేషన్లపై దాడి, ధారకొండ అవుట్‌పోస్టుపై దాడి, సీలేరు పోలీస్ స్టేషన్‌పై దాడి, రాజవొమ్మంగి, ఏలేశ్వరం పోలీస్టేషన్లపై దాడి సంఘటనలు ఏవోబీ నుంచే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులపై పోలీసులు పట్టు సాధించే క్రమంలో ఏవోబీలో ఆదివాసీ యువతకు ఉపాధి కల్పన, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించి వారికి దగ్గరయ్యారు. ఈ క్రమంలో 2016లో ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందన్న పక్కా సమాచారం తెలుసుకుని ఆంధ్రా, ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 30 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసి బలిమెల సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు మున్నా, తదితర మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. 2016 తరువాత మావోయిస్టు పార్టీలో నియామకాలు జరగకపోవడంతో పాటు కీలక నాయకులు అనారోగ్యం, వయోభారం వంటి పలు సమస్యలతో పాటు ఒడిశాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీస్ బలగాలతో అవుట్ పోస్టులను నెలకొల్పి మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. మావోయిస్టు కీలక నేత ఆర్కే అనారోగ్యంతో మృతి చెందడంతో పాటు పార్టీలో వివిధ అంతర్గత కారణాలతో కొందరు లొంగిపోవడం, మరో పక్క పార్టీలో రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో దాదాపుగా మావోయిస్టు పార్టీ అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చర్యలు ప్రారంభించింది. దీంతో చాలా మంది లొంగిపోయారు. ఏవోబీలో కీలక నేతలైన నంబాల కేశవరావు, చలపతి, కాకూరి పండన్న అలియాస్ జగన్, వాగా పొడియామి అలియాస్ రమేశ్ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. తాజాగా బుధవారం గాజర్ల రవి అలియాస్ ఉదయ్, చలపతి భార్య అరుణ, ఏసీఎం అంజు మృతి చెందడంతో ఏవోబీలో మావోయిస్టుల శకం ముగిసిపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు.