త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:18 AM
స్థానిక విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. అంతేకాకుండా లారీలోంచి పెద్ద బండరాయి రోడ్డుపై పడింది.
అండర్‌బ్రిడ్జి వద్ద గడ్డర్‌ను ఢీకొన్న బండరాళ్ల లోడు లారీ
విరిగిపడిన గడ్డర్
రోడ్డుపై పడిన బండరాయి
అనకాపల్లి టౌన్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. అంతేకాకుండా లారీలోంచి పెద్ద బండరాయి రోడ్డుపై పడింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే రైల్వే ట్రాక్ దెబ్బతినే పరిస్థితి ఉండేది. క్వారీ లారీలు పట్టణంలోకి రాకూడదని ఎన్ని షరతులు విధించినా పోలీసుల కళ్లు గప్పి అర్థరాత్రి దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము వరకు విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద నుంచే డ్రైవర్లు భారీ బండరాళ్ల లోడుతో రాంబిల్లి వైపు వెళుతున్నారు. ఇదే తరహాలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో భారీ బండరాళ్లతో వెళుతున్న లారీ విజయరామరాజుపేటకు అతి సమీపంలోని ఆర్‌పీఎఫ్ అధికారులు ఏర్పాటు చేసిన సేఫ్ గడ్డర్‌ను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. మరో రెండు గడ్డర్లు లారీలో ఉన్న బండరాళ్ల లోడు కారణంగా దెబ్బతిన్నాయి. గడ్డరు నేలకొరగడంతో పాటు లారీలో ఉన్న ఒక బండరాయి రోడ్డుపై పడింది. ఆ సమయంలో ఆ మార్గంలో ఎవరూ రాకపోకలు సాగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఆర్‌పీఎఫ్ సీఐ శ్రీనివాసరెడ్డి తన సిబ్బంది, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్‌ఐ శేఖరం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిన క్రేన్ సహకారంతో రోడ్డుపై విరిగి పడిన ఇనుప గడ్డర్‌ను పక్కకు తొలగించారు. అలాగే బండరాయిని ఫుట్‌పాత్‌పైకి చేర్చారు. ఈ ఏడాది మార్చిలో ఇదే విధంగా భారీ బండరాళ్ల లోడు లారీ గడ్డర్‌ను ఢీకొనడంతో ఆ గడ్డర్ రైల్వే ట్రాక్‌ను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా ట్రాక్ ఒరిగిపోవడంతో పలు రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం కూడా మూడో గడ్డర్‌ను లారీ ఢీకొని ఉంటే నాటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష నాయకులు కొణతాల హరనాథబాబు, గంటా శ్రీరామ్, తదితరులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి పరిశీలించారు. రైల్వే ఆస్తుల నష్టానికి కారణమైన రాజమండ్రికి చెందిన లారీపై కేసు నమోదు చేయడంతో పాటు లారీని అదుపులోకి తీసుకున్నామని ఆర్‌పీఎఫ్ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.