త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:13 PM
భద్రాచలం- పాడేరు ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి ఒడియా క్యాంప్ వద్ద 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు సురక్షితం
సీలేరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం- పాడేరు ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి ఒడియా క్యాంప్ వద్ద 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం 10 గంటలకు భద్రాచలం నుంచి 30 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు పాడేరు వెళుతున్నది. ఒడియా క్యాంప్ వద్దకు వచ్చే సరికి బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. అయితే అప్పటికే డొంకరాయి ఏపీజెన్‌కో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిర్వహణ పనులు చేపడుతున్నారు. దీంతో విద్యుత్ స్తంభానికి బస్సు బలంగా ఢీకొన్నా ఎవరు విద్యుదాఘాతానికి గురికాలేదు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.