తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:58 PM
మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద శనివారం పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ బ్రేక్ డౌన్ కావడంతో వేంపాడు హైవే టోల్‌ప్లాజా సమీపాన ఆగిపోయింది.
యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చెలరేగిన మంటలు, పొగలు
సకాలంలో అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్న జనం
నక్కపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద శనివారం పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న యాసిడ్ ట్యాంకర్ బ్రేక్ డౌన్ కావడంతో వేంపాడు హైవే టోల్‌ప్లాజా సమీపాన ఆగిపోయింది. అదే రూటులో వెళుతున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆ ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో ట్యాంకర్ నుంచి యాసిడ్ లీకవ్వడంతో పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించాయి. స్థానికులు, పలువురు వాహన చోదకులు భయాందోళనకు గురయ్యారు. సుమారు అర్థగంట సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. యాసిడ్ ట్యాంకర్ దగ్ధమవుతుందని అందరూ భయపడిన తరుణంలో అగ్నిమాపక సిబ్బంది, హైవే పెట్రోలింగ్, నేషనల్ హైవే అథారిటీస్ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను స్థానిక పోలీసులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. దీనిపై నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.