Share News

అంధకారంలో పెద్దాస్పత్రి!

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:51 AM

నగరంలోని కేజీహెచ్‌లో గురువారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలముకున్నాయి.

అంధకారంలో పెద్దాస్పత్రి!

కేజీహెచ్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

మార్చురీ వద్ద పనులు చేస్తుండగా తెగిపోయిన కేబుల్‌

పునరుద్ధరణపై దృష్టిసారించని అధికారులు

వార్డుల్లో చిమ్మ చీకట్లతో రోగుల అవస్థలు

అత్యవసర విభాగాలకు జనరేటర్‌ ద్వారా సరఫరా

నీటి సరఫరా కూడా బంద్‌

మహారాణిపేట (విశాఖపట్నం), నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని కేజీహెచ్‌లో గురువారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలముకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భావనగర్‌ వార్డు, రాజేంద్రప్రసాద్‌ వార్డు, పిల్లల వార్డు, గైనిక్‌ వార్డు, సీఎస్‌ఆర్‌ బిల్డింగ్‌లోని కొన్ని విభాగాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రి మార్చురీలో అండర్‌ గ్రౌండ్‌ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ప్రధాన వార్డులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌ సేవలందించే అత్యవసర విభాగాలు ఉన్న సీఎస్‌ఆర్‌ బిల్డింగ్‌, భావనగర్‌ వార్డులోని అక్యూట్‌ మెడికల్‌ విభాగానికి జనరేటర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారు. మిగిలిన వార్డులలోని రోగులు తీవ్ర ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్‌ లేకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా మరుగుదొడ్లు వినియోగించేవారు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆ పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. రాత్రి 9 గంటలు దాటినా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో రోగులు చిమ్మచీకట్లో అవస్థలు పడుతున్నారు. వార్డుల్లో మీద బెడ్‌ మీద ఉండాల్సిన రోగులు ఆరుబయటకు వచ్చి వరండాల్లో తిరుగాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఆస్పత్రి చరిత్రలో ఇన్ని గంటలు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన దాఖలాలు లేవు. అంతేకాకుండా సమస్యను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకునే అధికారులు లేకపోవడంతో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఆస్పత్రి పరిపాలనాధికారి గురువారం కేజీహెచ్‌లో లేరు. అత్యవసర చికిత్స విభాగాలకు జనరేటర్‌పై అధిక సమయం విద్యుత్‌ సరఫరా చేయడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లోని రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలియడం లేదు.

Updated Date - Nov 07 , 2025 | 12:51 AM