Share News

నగరానికి మణిహారం

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:15 AM

నగరానికి పర్యాటకంగా మరో మణిహారం అందుబాటులోకి వచ్చింది.

నగరానికి మణిహారం

కైలాసగిరిపై గ్లాస్‌ బ్రిడ్జి ప్రారంభం

సందర్శకులను అనుమతిస్తున్న అధికారులు

విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

నగరానికి పర్యాటకంగా మరో మణిహారం అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరిపై రూ.7 కోట్లతో నిర్మించిన గ్లాస్‌ బ్రిడ్జిని సోమవారం ప్రారంభించి సందర్శకులను అనుమతిస్తున్నారు. నాలుగు నెలల క్రితమే నిర్మాణం పూర్తిచేసుకున్న గ్లాస్‌ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావించారు. ప్రతిసారీ కార్యక్రమం వాయిదా పడుతుండడంతో సోమవారం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌తో ప్రారంభింపజేశారు.

ఈ సందర్భంగా వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ మాట్లాడుతూ కైలాసగిరిపై ఇప్పటికే స్కై సైక్లింగ్‌, పారా గ్లైడింగ్‌ అందుబాటులోకి వచ్చాయన్నారు. హుద్‌హుద్‌ వంటి భారీ తుపాన్లను కూడా తట్టుకొని నిలబడేలా గ్లాస్‌ బ్రిడ్జి నిర్మించామన్నారు. త్వరలో కైలాసగిరిపై త్రిశూల్‌, ఽఢమరుకం నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. చీకటి పడిన తరువాత నగర ప్రజలకు స్పష్టంగా కనిపించేలా లైటింగ్‌ ఏర్పాట్లు చేస్తామన్నారు. వీటన్నింటితో విశాఖకు పర్యాటక రంగంలో మరిన్ని పెట్టుబడులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కైలాసగిరిని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, ఈఈ మధుసూదనరావు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 01:15 AM