Share News

ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:17 AM

విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే వుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని అన్నారు. శుక్రవారం స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్‌ శంకరన్‌ భవనంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత
సత్కారం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి అనిత, ఎమ్మెల్యే కొణతాల, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, డీఈవో అప్పారావునాయుడు, ఇతర ప్రముఖులు

పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి

సమాజంలో ఉపాధ్యాయ వృత్తికే అధిక గౌరవం

గురుపూజోత్సవంలో హోం మంత్రి అనిత

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే వుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని అన్నారు. శుక్రవారం స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్‌ శంకరన్‌ భవనంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటం వద్ద కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయులకు గౌరవం, గుర్తింపు అధికంగా వుంటాయని, అన్ని ఉద్యోగాల కంటే ఉపాధ్యాయ వృత్తి ఎక్కువ ఆత్మ సంతృప్తిని ఇస్తుందని తాను గతంలో ఉపాధ్యాయ వృత్తిలో వున్నానని, 12 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చి నాయకురాలిగా ఎదిగానని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా పోక్సో కేసుల్లో ఇరుక్కుంటున్నారని, ఇటువంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ, విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన సాగించాలని ఉపాధ్యాయులను కోరారు. టీచర్ల కృషి కారణంగానే గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనకాపల్లి జిల్లా ఐదో స్థానంలో నిలిచిందన్నారు. అన్ని పాఠశాలల్లో యూత్‌ క్లబ్‌, సైన్స్‌ క్లబ్‌, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయించినట్టు చెప్పారు. ప్రతి తరగతికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి విద్యార్థుల హాజరు, హోం వర్కు వివరాలు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉత్తమ విద్యా వేత్త అని, విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. అన్ని పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహించాలని కోరారు. విద్యా శాఖను మంత్రి నారా లోకేశ్‌ అత్యంత సమర్థనీయంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 39 మందిని మంత్రి అనిత, ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించి, ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, డిప్యూటీ డీఈవో పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 01:17 AM