Share News

డాక్టర్స్ లేని ఆసుపత్రి

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:20 AM

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది పిల్లల సత్వర ఆరోగ్య కేంద్రం పరిస్థితి. ఇక్కడ అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికి వైద్యం చేయడానికి డాక్టర్లు లేరు. ఆస్పత్రిని నడపడానికి మెడికల్‌ ఆఫీసర్‌, పిల్లలకు వైద్యం చేయడానికి చంటి పిల్లల డాక్టర్‌ లేరు. నర్సులు, టెక్నికల్‌ సిబ్బందితోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

డాక్టర్స్ లేని ఆసుపత్రి
నర్సీపట్నంలోని జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం

- బాలల సత్వర చికిత్సా కేంద్రంలో వైద్యుల పోస్టులన్నీ ఖాళీ

- పుట్టుకతో వివిధ లోపాలు గల పిల్లలకు వైద్యం

- వైద్యాధికారి, పిల్లల డాక్టర్‌ లేకుండా నడుపుతున్న పిల్లల ఆస్పత్రి

- మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఉన్నా ఫలితం శూన్యం

నర్సీపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది పిల్లల సత్వర ఆరోగ్య కేంద్రం పరిస్థితి. ఇక్కడ అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికి వైద్యం చేయడానికి డాక్టర్లు లేరు. ఆస్పత్రిని నడపడానికి మెడికల్‌ ఆఫీసర్‌, పిల్లలకు వైద్యం చేయడానికి చంటి పిల్లల డాక్టర్‌ లేరు. నర్సులు, టెక్నికల్‌ సిబ్బందితోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

రాషీ్ట్రయ బాలల సురక్ష కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా 2022లో బాలల సత్వర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, గ్రహణం మొర్రి, వంకర కాళ్లు, వినికిడి, దంత, దృష్టి, చర్మ సమస్యలు, బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం, మాటలు నేర్చుకోవడంలో ఆలస్యం, న్యూరల్‌ ట్యూబ్‌ లోపాలతో ఉన్న 0-18 సంవత్సరాల పిల్లలకు జిల్లా బాలల సత్వర ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారు. గుండె సమస్యలు ఉన్నవారికి తిరుపతి పద్మావతి ఆస్పత్రి, మెడికవర్‌ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తారు. ఫిజియో థెరఫీ, సత్వర చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలు, వినికిడి సామర్థ్యాన్ని పరీక్షించే ఆధునిక యంత్రాలు, నేత్ర, దంత పరీక్షల విభాగాలు ఉన్నాయి. బుద్ధిమాంద్యం పిల్లలకు బోధించడానికి ప్రత్యేకంగా ట్రైనర్‌ ఉన్నారు. ఇక్కడున్న అన్ని విభాగాలకు వైద్య నిపుణులను నియమిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవసరం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు లేకపోవడంతో సిబ్బందే సేవలందిస్తున్నారు. గుండె సమస్యలు ఉన్న వారిని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం చేస్తున్నారు. రోజుకి 10 నుంచి 15 మంది పిల్లలకు ఈ చికిత్సా కేంద్రంలో ఓపీ సేవలు అందిస్తున్నారు. పిల్లల మానసిక వికాసం కోసం ఆడుకోవడానికి వస్తువులు ఉన్నాయి. ఆస్పత్రి ఆవరణ, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు చూసి... ఇంత మంచి ఆస్పత్రికి వైద్యులు లేక పోవడం బాధనిపిస్తుందని పలువురు వాపోతున్నారు.

డాక్టర్లు లేక నిరుపయోగంగా ఆస్పత్రి

ఫిజియోథెరిపీకి అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయి. అయితే ఫిజియోథెరపిస్ట్‌ లేరు. దంత విభాగం ఉంది.. దంత వైద్య నిపుణులు లేరు. అలాగే పిల్లల వైద్యుడు, వైద్యాధికారి, పిల్లల మనస్తత్వ నిపుణులు, వినికిడి పరీక్ష, స్పీచ్‌ థెరపీ నిపుణులు, కంటి వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం వైద్య సిబ్బంది మాత్రమే ఉన్నారు. డెంటల్‌ హైజనిస్ట్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌, సోషల్‌ వర్కర్‌, స్టాఫ్‌ నర్సులు పని చేస్తున్నారు. వైద్యులు లేకుండా నడుస్తున్న ఆస్పత్రికి ఆదరణ కూడా లేకుండాపోయింది. రూ.కోటి పైగా వెచ్చించి నిర్మించిన ఆస్పత్రి భవనం, వైద్య పరికరాలు నిరుపయోగం అవుతున్నాయి. ఇక్కడ వైద్యుల కొరత ఉందన్న విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఇటీవల విశాఖపట్నం వచ్చిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ సౌరభ్‌ గౌర్‌ దృషికి తీసుకు వెళ్లారు. ఈ విషయమై ఆర్‌బీఎస్‌కే ప్రాజెక్టు ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రశాంతి వివరణ కోరగా, బాలల సత్వర ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల కొరత ఉందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని, త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

Updated Date - Dec 29 , 2025 | 12:20 AM