అడుగుకో అతుకు.. గజానికో గొయ్యి!
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:51 AM
జిల్లాలో పలు రహదారులు అడుగడుగునా గోతులతో దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల పరిధిలోని పలు రహదారులు మరింత ఛిద్రం అయ్యాయి.
జిల్లాలో అధ్వానంగా రహదారులు
తుఫాన్ వర్షాలకు పరిస్థితి మరింత దయనీయం
రోడ్ల నిర్వహణను గాలికొదిలేసిన గత వైసీపీ ప్రభుత్వం
ఒక్క ఏడాది కూడా నిధులివ్వని వైనం
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది క్రితం తాత్కాలిక మరమ్మతులు
వర్షాలతో మళ్లీ మొదటికొచ్చిన సమస్య
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
జిల్లాలో పలు రహదారులు అడుగడుగునా గోతులతో దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల పరిధిలోని పలు రహదారులు మరింత ఛిద్రం అయ్యాయి. ప్రధానంగా బీఎన్ రోడ్డు, వడ్డాది-తాటిపర్తి, రావికమతం- ఈ.కన్నూరుపాలెం (ఆర్‌ఈసీ) రహదారులు దారుణంగా వున్నాయి. చెరువులను తలపిస్తున్న గోతులు, లేచిపోయిన రాళ్లు/కంకరతో వాహనదారుల ఇక్కట్లు వర్ణనాతీతం. రోడ్ల నిర్వహణ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రదర్శించిన తీవ్ర నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఎంతలా అంటే.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబరులో మరమ్మతులు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
గత నెలలో సంభవించిన మొంథా తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాలతో ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 366.92 కిలోమీటర్ల పొడవుగల రోడ్లు 79 చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. 13 కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. అనకాపల్లి, చోడవరం, రావికమతం, మాడుగుల, సబ్బవరం, బుచ్చెయ్యపేట, ఎస్.రాయవరం, కశింకోట, కోటవురట్ల, తదితర మండలాల్లో రోడ్లు బాగా పాడయ్యాయి.
అధ్వాన రోడ్లలో మచ్చుకు కొన్ని....
అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం మీదుగా చోడవరం వెళ్లే రోడ్డు పలుచోట్ల గోతులతో దారుణంగా వుంది. వాస్తవంగా ఈ రోడ్డు అభివృద్ధి పనులను మూడు నెలల కిందట చేపట్టారు. అయితే అప్పటి నుంచి గత నెలాఖరు వరకు వర్షాలు పడుతుండడంతో పనులు ఆపేశారు.
అనకాపల్లి నుంచి గాజువాక వెళ్లే జాతీయ రహదారిపై కొప్పాక వద్ద ఏలేరు కాలువ పొంగడంతో వరద ప్రవాహంతో బాగా దెబ్బతిన్నది.
బీఎన్ రోడ్డులో చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు రహదారి మొత్తం ఛిద్రమై భారీ గోతులతో దారుణంగా తయారైంది.
వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు 14 కిలోమీటర్ల మేర రహదారి దయనీయంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి.
రావికమతం నుంచి తట్టబంద మీదుగా కశింకోట మండలం ఈశ్వర కన్నూరుపాలెం వెళ్లే ఆర్‌ఈసీ రోడ్డులో పలుగ్రామాల వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షం కురిస్తే నీరు చేరి పంట కుంటలను తలపిస్తున్నాయి.
కశింకోట మండలం తాళ్లపాలెం హైవే జంక్షన్ నర్సీపట్నం వెళ్లే రోడ్డులో కశింకోట మండల పరిధిలో పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల పూడ్చినప్పటికీ మొంథా తుఫాన్ సమయంలో కురిసిన వర్షాలతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డు నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డులో ఇందేశమ్మవాక ప్రాంతంలో రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. ఐదారు నెలల క్రితం బ్లాక్ మెటల్‌తో ఈ గోతులను కప్పగా.. వర్షాలతో మెటల్ కొట్టుకుపోయి గోతులు మళ్లీ ప్రత్యక్షం అయ్యాయి.
నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభం
నందమూరి సాంబశివరావు, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ
గత నెలలో తుఫాన్ సమయంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతోపాటు, మిగిలిన రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. బీఎన్ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరుతో చర్చలు జరిపాం. ప్రస్తుతం ఈ పనులు నెమ్మదిగా జరగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో వేగం పుంజుకుంటాయి.