బీఎన్ రోడ్డులో నరకప్రయాణం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:48 AM
చోడవరం నియోజకవర్గంలో పరిధిలో భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు అత్యంత దారుణంగా వుంది. జిల్లాలో మరే ఇతర రహదారి ఇంత అధ్వానంగా లేదు. మూడు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించి బీఎన్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది.
ఇదే స్థితిలో వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారి
ఆరున్నరేళ్లుగా ఇక్కట్లు పడుతున్న ప్రయాణికులు, వాహనదారులు
చోడవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): చోడవరం నియోజకవర్గంలో పరిధిలో భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు అత్యంత దారుణంగా వుంది. జిల్లాలో మరే ఇతర రహదారి ఇంత అధ్వానంగా లేదు. మూడు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించి బీఎన్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల మీదుగా రోలుగుంట మండలం వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర రహదారి పలుచోట్ల ఆనవాళ్లు లేదు. ఆరున్నరేళ్లుగా.. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ రోడ్డు అభివృద్ధికి ఎన్‌డీబీ నిధులు రూ.110 కోట్లతో చేపట్టిన పనులు గత ప్రభుత్వ నిర్వాకంతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావచ్చినా అతీగతీ లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ రోడ్డు అభివృద్ధి పనుల్లో పెద్దగా పురోగతి లేదు.
ఇక వడ్డాది-పాడేరు రోడ్డులో వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు 15 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారి దారుణంగా వుంది. ఈ రోడ్డుమీదుగా మూడు జిల్లాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎంతో ప్రాధాన్యం వున్న ఈ రహదారిపై పలుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. సరుకు రవాణా వాహనాల్లో గోతుల్లో కూరుకుపోవడం, బోల్తా పడడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి.