Share News

చెరువుల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:22 AM

జల వనరుల శాఖ నర్సీపట్నం డివిజన్‌లో సాగునీటి చెరువుల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చెరువుల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక
రాంబిల్లి మండలం రజాలా గ్రామంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న శారదానది గట్టు

ఆర్‌ఆర్‌ఆర్‌ పథకం కింద 47 పనులకు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు

తాండవకు రూ.12.24 కోట్లు

మైనర్‌ ఇరిగేషన్‌ పనులకు రూ.12 కోట్లు

నర్సీపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ నర్సీపట్నం డివిజన్‌లో సాగునీటి చెరువుల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘ట్రిపుల్‌ ఆర్‌’ (రిపేర్‌, రెనోవేషన్‌, రెస్టోరేషన్‌) పథకం కింద 47 చెరువుల అభివృద్ధికి రూ.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చును భరిస్తాయి. ఐదు ఎకరాలు, అంతకుమంచి గర్భం ఉన్న చెరువుల అభివృద్ధికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పంట కాలువల ఆధునికీకరణ, చెరువు గట్లు పటిష్ఠం, మదుములకు మరమ్మతులు, అవసరమైనచోట కొత్త మదుముల నిర్మాణం వంటి పనులు చేస్తారు.

గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల మాదిరిగానే సాగునీటి పారుదల రంగాన్ని కూడా నిర్వీర్యం చేసింది. ఒక్క ఏడాది కూడా చెరువులు, పంట కాలువలు, ఇతర సాగునీటి వనరుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో పంట కాలువల్లో పూడిక విపరీతంగా పేరుకుపోయింది. గట్లపైన, కాలువల్లో తుప్పలు పెరిగిపోయాయి. సిమెంట్‌ లైనింగ్‌లు దెబ్బతిన్నాయి. మదుముల గేట్లు పాడై నీరు వృథాగా పోయేది. ఈ సమస్యల కారణంగా ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జల వనరుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం ఈఈ బాలసూర్యం ‘ట్రిపుల్‌ ఆర్‌’ పథకం కింద చెరువుల అభివృద్ధికి అంచనాలు తయారు చేసి రూ.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

మొంథా తుఫాన్‌ ప్రభావం ఎంతంటే?

మొంథా తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న సాగునీటి పథకాల మరమ్మతులకు జలవనరుల శాఖ అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తుఫాన్‌ ప్రభావంతో అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందించే తాండవ ఆనకట్టకు సంబంధించి పలు చోట్ల పంట కాలువలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి జిల్లాలో 89 పనులకు రూ.9.88 కోట్లు, కాకినాడ జిల్లాలో 24 పనులకు రూ.2.36 కోట్లు చొప్పున మొత్తం రూ.12.24 కోట్లతో 113 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొంథా తుఫాన్‌ కారణంగా మైనర్‌ ఇరిగేషన్‌ పథకాలు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. రాంబిల్లి మండలంలో రజాలా అగ్రహారం వద్ద శారదానది కుడి కాలువ గట్టు 150 మీటర్లు కొట్టుకుపోయింది. మునకపాక మండలం కుమారపురం వద్ద రోలుగెడ్డ గట్టు కొట్టుకుపోయింది. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామంలో జాగారం గెడ్డ గట్టు దెబ్బతిన్నది. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణాపల్లి ఆనకట్ట గట్టు రాతి పేర్పు జారిపోయి గట్టు కుంగింది. జలవనరుల శాఖ డివిజన్‌ పరిధిలోని 14 మండలాలలో మొంథా తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న మైనర్‌ ఇరిగేషన్‌ పథకాలకు సంబంధించి 148 పనులకు రూ.12 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులోనే ప్రత్యేకంగా రావాణాపల్లి ఆనకట్ట మరమ్మతులకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపారు.

Updated Date - Nov 25 , 2025 | 12:22 AM