కలగానే కాలిబాట వంతెన
ABN , Publish Date - May 13 , 2025 | 01:31 AM
శారదా నదిపై కశింకోట వద్ద డీఎంఎఫ్ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన కాలిబాట వంతెన ఐదేళ్ల నుంచి పునాదుల్లోనే వుండిపోయింది.

కశింకోటవాసులకు అందుబాటులోకి రాని వారధి
శారదా నదిపై ఫుట్‌బ్రిడ్జి నిర్మాణానికి ఐదేళ్ల క్రితం శంకుస్థాపన
డీఎంఎఫ్ నుంచి రూ.3 కోట్లు మంజూరు
ఏడాదిలో వంతెన పూర్తవుతుందని నాటి ఎమ్మెల్యే అమర్ వెల్లడి
రూ.50 లక్షల మేర పనులు చేసి బిల్లు పెట్టిన కాంట్రాక్టర్
నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలుపుదల
రెండున్నరేళ్లపాటు మంత్రిగా ఉన్నా.. పట్టించుకోని అమర్‌నాథ్
కశింకోట, మే 12 (ఆంధ్రజ్యోతి):
శారదా నదిపై కశింకోట వద్ద డీఎంఎఫ్ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన కాలిబాట వంతెన ఐదేళ్ల నుంచి పునాదుల్లోనే వుండిపోయింది. ఏడాదిలో వంతెన అందుబాటులోకి వస్తుందని, కశింకోట వాసుల ఇక్కట్లు తొలగుతాయని 2020 జనవరిలో శంకుస్థాపన చేసిన నాటి ఎమ్మెల్యే గుడివాడ్ అమర్‌నాథ్.. తరువాత మంత్రిగా పనిచేసినప్పటికీ వంతెన నిర్మాణం పూర్తికాలేదు. దీంతో వర్షాకాలంతోపాటు నదిలో నీటి ప్రవాహం అధికంగా వున్నప్పుడు అవతల వైపున వున్న పంట పొలాలు, కల్లాల వద్దకు వెళ్లిరావడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి దోనెపై ప్రాణాలను ఫణంగా పెట్టి రాకపోలు సాగించాల్సి వస్తున్నది.
కశింకోట పంచాయతీలోని పలుకాలనీలు, వీధులకు చెందిన రైతుల పొలాలు శారదా నదికి అవతల వైపున వున్నాయి. చాలా మంది రైతులు తమ పశువులశాలలను కూడా పొలాల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. పశువులకు మేత వేయడం, పాలు పితకడం, పొలాల్లో పనుల కోసం నిత్యం రైతులు, కూలీలు నది అవతల వైపునకు వెళ్లివస్తుంటారు. మునగపాక మండలం ఉమ్మలాడ వాసులు కశింకోట రావడానికి ఇదే దగ్గర దారి. నిత్యం సుమారు రెండు వేల మంది వరకు ఇక్కడ నదిని దాటుతుంటారు. శారదా నదిలో ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు నీటి ప్రవాహం అధికంగా వుంటుంది. ఇక్కడ వంతెన లేకపోవడంతో తాటిదోనెల ఆధారంగా నదిని దాటుతుంటారు. వరద ఉధృతి అధికంగా వున్నప్పుడు తాటిదోనెలు బోల్తాపడి, పలువురు మృత్యువాతపడిన సంఘటనలు కూడా వున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ వంతెన నిర్మించి తమ కష్టాలను గట్టెక్కించాలని రైతులు చాలా కాలంగా అధికారులను కోరుతున్నారు. ఎట్టకేలకు గత తెలుగుదేశం హయాంలో వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. గ్రీన్ సిగ్నల్ లభించేలోగా ప్రభుత్వం మారిపోయింది. కొంతకాలంపాటు ఎటువంటి కదలిక లేదు. తరువాత డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి రూ.3 కోట్లు కేటాయించడంతో 2020 జనవరి 9న వంతెన నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే గుడివాడ్ అమర్‌నాథ్ (తరువాత మంత్రి అయ్యారు) గవరపేట వీధికి సమీపంలో శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తవుతాయని, కశింకోట వాసుల కష్టాలు తొలగుతాయని చెప్పారు. టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో కాంట్రాక్టర్ వెంటనే పనులు ప్రారంభించారు. అదే ఏడాది జూన్‌నాటికి మొత్తం 16 పైల్స్‌కిగాను (నదిలో నిర్మించే సిమెంట్ పిల్లర్ల పునాదులు) 11 పైల్స్ పనులు పూర్తిచేశారు. మొదటి విడతగా రూ.50 లక్షలకు బిల్లు పెట్టారు. వారాలు, నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. ఆ తరువాత అమర్‌నాథ్ రెండేళ్లకుపైగా మంత్రిగా పనిచేశారు. కానీ కశింకోటలో శారదా నదిపై కాలిబాట వంతెన నిర్మాణం గురించి పట్టించుకోలేదు.
గత ప్రభుత్వం గాలికొదిలేసింది
భీశెట్టి మహేశ్వరి, గవరపేట వీధి, కశింకోట
శారదా నదిలో దోనెపై ప్రయాణించడం ప్రమాదకరమైనప్పటికీ తప్పడంలేదు. చాలా ఏళ్ల క్రితం దోనెలో నదిని దాటుతుండగా వరద ఉధృతికి దోనె కొట్టుకుపోయి ఇద్దరు మృతిచెందారు. నదిపై కాలిబాట వంతెన నిర్మించాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందించి కాలిబాట వంతెన నిర్మాణం పూర్తిచేయాలి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం
వేణుగోపాల్, పంచాయతీరాజ్ డీఈ, అనకాపల్లి
కశింకోట వద్ద శారదా నదిపై కాలిబాట వంతెన నిర్మాణానికి ఐదేళ్ల క్రితం రూ.50 లక్షలు ఖర్చు కొన్ని పైల్స్ నిర్మించారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్టు తెలిసింది. కాలిబాట వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరం అవుతాయి. ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతాం.