Share News

చెదలుపడుతున్న ఫుడ్‌ లేబొరేటరీ!

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:52 AM

ఆహార భద్రత, ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో పెదవాల్తేరులోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ నిరుపయోగంగా ఉంది.

చెదలుపడుతున్న ఫుడ్‌ లేబొరేటరీ!

ఏడాదిన్నర కిందట ల్యాబ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

ఇంకా సేవలు ప్రారంభించని అధికారులు

నిరుపయోగంగా సుమారు రూ.15 కోట్ల విలువైన పరికరాలు

ఇప్పటికీ ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ పంపాల్సిన పరిస్థితి

ఫలితాలు వచ్చేందుకు నాలుగైదు వారాలు పడుతోందంటున్న ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఆహార భద్రత, ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో పెదవాల్తేరులోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీ నిరుపయోగంగా ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ ల్యాబ్‌ను ఏడాదిన్నర కిందట ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకూ అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ ల్యాబ్‌ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్లు, పరికరాలు, పరీక్షల నిర్వహణకు అవసరమైన కెమికల్స్‌ కోసం మరో రూ.15 కోట్లు వెచ్చించారు. అయితే, అంత ఖర్చు చేసి సిద్ధం చేసిన ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై ఉన్నతాధికారులు దృష్టిసారించడం లేదు. దీంతో ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు నిర్వహించే తనిఖీల్లో సేకరించే నమూనాలను పరీక్షించడం ఇబ్బందిగా మారుతోంది.

రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఇప్పటికీ ఆహార నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లో ఉన్న స్టేట్‌ ఫుడ్‌ లేబొరేటరీకే పంపించాల్సి వస్తోంది. దీంతో ఫలితాల కోసం నాలుగు నుంచి ఐదు వారాలపాటు నిరీక్షించాల్సి వస్తోందని ఆహార భదత్ర, ప్రమాణాల శాఖ అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాల మేరకు విశాఖలో పెద్దఎత్తున హోటల్స్‌, రెస్టారెంట్‌లు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. అనేకచోట్ల కెమికల్స్‌, ఇతర రసాయనాలు వినియోగించినట్టు అనుమానం రావడంతో నమూనాలను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఆ ఫలితాలు ఇప్పటివరకూ రాకపోవడం ఆయా హోటళ్లపై చర్యలు తీసుకోవడానికి ప్రతిబంధకంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

నిరుపయోగంగా పరికరాలు

కేంద్ర ప్రభుత్వం ఏపీతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ ల్యాబ్‌లను మంజూరుచేసింది. ఏపీలో మూడు ల్యాబ్‌ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో ల్యాబ్‌ ఏర్పాటు, పరికరాలు కోసం సుమారు రూ.30 కోట్లు కేటాయించింది. అయితే, ఈ మూడుచోట్ల కూడా ల్యాబ్‌లు ప్రారంభమైనా సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ల్యాబ్‌లు నిరుపయోగంగా ఉండడానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణంగా పేర్కొంటున్నారు. ఏడాది కిందట సుమారు రూ.15 కోట్ల విలువజేసే అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌కు చేరాయి. ఈ పరికరాలను ఇప్పటివరకూ బయటకు తీయలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆహార నాణ్యత, రసాయనాలు వినియోగం, పాయిజన్‌, ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర పదార్థాలు వినియోగం, కలుషిత నీటి నిర్ధారణ వంటి పరీక్షల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక హాట్‌ ఎయిర్‌ ఒవెన్‌, మఫుల్‌ ఫర్నేస్‌, వాటర్‌ బాత్‌, ఎల్‌సీ-ఎంఎస్‌, జీసీ-ఎంఎస్‌, ఐసీపీ ఎంఎస్‌, బాలెన్స్‌, ఆటో క్లేవ్‌, మైక్రోస్కోప్‌ వంటి 60 పరికరాలు ల్యాబ్‌లో నిరుపయోగంగా పడి ఉన్నాయి. అలాగే, సుమారు రూ.2 కోట్ల విలువైన కెమికల్స్‌ ఉన్నాయని, ఇవి రోజులు గడిచినకొద్దీ వినియోగించలేని స్థితికి చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరికరాల ద్వారా బిస్కెట్స్‌, పాలు, పాల ఉత్పత్తులు, ఆయిల్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ వంటి 17 రకాల ఆహార పదార్థాలను పరీక్షించేందుకు అవకాశం ఉంది. ఈ ల్యాబ్‌ నిర్వహణకు అవసరమైన సుమారు 70 మంది సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ల్యాబ్‌ అందుబాటులోకి రాకపోవడానికి అది కూడా ప్రధానమైన అడ్డంకిగా మారినట్టు చెబుతున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:52 AM