Share News

పర్యాటక ప్రాజెక్టుల వెల్లువ

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:45 AM

విశాఖపట్నంలో రెండు రోజులు జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి.

పర్యాటక ప్రాజెక్టుల వెల్లువ

భాగస్వామ్య సదస్సులో బోలెడు ఒప్పందాలు

ఉమ్మడి జిల్లాలో అరకులోయ, లంబసింగిల్లో కారవాన్‌ పార్కులు

అరకులో కాఫీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

భూమి కేటాయింపునకు ప్రభుత్వం అంగీకారం

ఆనందపురం మండలం దబ్బందలో వెల్‌నెస్‌ సెంటర్‌

వెల్‌నెస్‌ సెంటర్‌, అడ్వంచర్‌ అండ్‌ ఎకో టూరిజం సెంటర్‌ ఏర్పాటుకు ‘వరల్డ్‌ బ్లిస్‌’ ఒప్పందం

రూ.100 కోట్లతో ‘నవతరం’ స్టూడియో

స్డూడియో ఏర్పాటుకు ఒప్పందం ‘కల్చరల్‌ కారవాన్‌ ఇండియా’ ఎంవోయూ

రూ.150 కోట్లతో ‘సన్‌ ఇనిస్టిట్యూట్‌’ హోటల్‌ నిర్మాణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో రెండు రోజులు జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎక్కువగా బీచ్‌ రిసార్ట్స్‌, వెల్‌నెస్‌ సెంటర్లు, ఎకో టూరిజం ప్రాజెక్టులు, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌, కార్వాన్లు వంటివి ఉన్నాయి.

అరకులోయ, లంబసింగిల్లో కారవాన్‌ పార్క్‌లు ఏర్పాటు చేయడానికి వైజాగ్‌ రిక్రియేషన్స్‌ సంస్థ ముందుకువచ్చింది. పర్యాటకులను గమ్యస్థానాలకు చేర్చడానికి వసతులతో కూడిన వాహనాలు మాత్రమే ఉపయోగిస్తే వాటిని ‘కారవాన్‌’గా వ్యవహరిస్తారు. అలా కాకుండా నిర్దేశించిన గమ్యస్థానాల్లో కొంత స్థలం తీసుకొని పర్యాటకులకు రెస్టారెంట్‌, రాత్రి బస చేయడానికి కూడా వసతులు కల్పిస్తే వాటిని ‘కారవాన్‌ పార్కు’లుగా పేర్కొంటారు. వైజాగ్‌ రిక్రియేషన్స్‌ సంస్థ అరకు, లంబసింగిల్లో కారవాన్‌ పార్కులు పెడుతుంది. దీనికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం లీజు పద్ధతిలో సమకూరుస్తుంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు సహకరిస్తారు. ఈ వారంలోనే భూమిని చూపించి లీజు ఒప్పందానికి వెళతారని సమాచారం. ఈ రెండు ప్రాంతాలతో పాటు బాపట్లలో కూడా కారవాన్‌ పార్క్‌ ఏర్పాటుకు ఈ సంస్థ ఒప్పందం చేసింది. మొత్తం రూ.15 కోట్ల పెట్టుబడితో 145 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఓజీ డ్రీమ్‌లైనర్స్‌ అనే సంస్థ కారవాన్లు అద్దెకు ఇస్తామని ఎంఓయూ చేసింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 80 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. అదేవిధంగా శ్రీనివాస్‌ కారవాన్స్‌ సంస్థ రూ.2 కోట్లతో 20 మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసింది. వీరంతా పర్యాటకుల సంఖ్య ఆధారంగా ఎక్కడ డిమాండ్‌ ఉంటే అక్కడి నుంచి కారవాన్లు నడుపుతారు. అద్దెకు ఇస్తారు.

కాఫీ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

సదస్సులో అరకు కాఫీ గురించి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అరకులో కాఫీ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా అవగాహన ఒప్పందం కుదిరింది. ‘అరకు గోల్డ్‌ కాఫీ’ పేరుతో ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ పెట్టడానికి ఓ సంస్థ చొరవ చూపింది. రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ సెంటర్‌ ద్వారా 1,020 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాఫీ ఎలా పండుతుంది?, దానిని ప్రాసెస్‌ చేసి కాఫీ పొడిగా ఎలా తయారుచేస్తారు?...వంటి అంశాలన్నీ అక్కడ పర్యాటకులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ఇది మంచి ప్రాజెక్టుగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

దబ్బందలో వెల్‌నెస్‌ సెంటర్‌

ఆనందపురం మండలంలోని శొంఠ్యాం సమీపాన దబ్బందలో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటుకు విజయనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ ఎంఓయూ చేసింది. సుమారుగా ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ అధినేత తిరుపతిరాజు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దాదాపు రూ.45 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ వెల్‌నెస్‌ సెంటర్‌లో 170 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

- వరల్డ్‌ బ్లిస్‌ అనే సంస్థ కూడా ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, అడ్వంచర్‌ అండ్‌ ఎకో టూరిజం సెంటర్‌ ఏర్పాటుకు ఎంఓయూ చేసింది. వీరు రూ.100 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఏ ప్రాంతంలో అనేది ఇంకా ఖరారు కాలేదు.

నవతరం సినీ స్టూడియో

రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైనది ఉమ్మడి విశాఖ జిల్లానే. విశాఖపట్నం, భీమిలి, గంగవరం, అప్పికొండ, యారాడ, కొండకర్ల ఆవ ప్రాంతాలతో పాటు అరకు, లంబసింగి తదితర చోట్ల కొన్ని దశాబ్దాలుగా సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. విశాఖలో సినిమా స్టూడియోలు ఏర్పాటు చేయడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని భూములు కూడా కోరుతున్నారు. తాజాగా జరిగిన సదస్సులో నవతరం సినీ స్టూడియోస్‌ సంస్థ స్టూడియో ఏర్పాటుకు ఎంఓయూ చేసింది. రూ.100 కోట్ల పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది. ఎక్కడ అనేది ఇంకా స్పష్టత రాలేదు. భూమి కేటాయింపులపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

- కల్చరల్‌ కారవాన్‌ ఇండియా అనే సంస్థ కూడా స్డూడియో ఏర్పాటుకు ఒప్పందం చేసింది. భూమి కేటాయిస్తే రూ.60 కోట్ల పెట్టుబడితో 25 మందికి ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.

- సాగర్‌నగర్‌లో పర్యాటక శాఖ భవనంలో సన్‌ ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ నడుపుతున్న జాస్తి శ్రీకాంత్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేశారు. రూ.150 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 01:45 AM