Share News

మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాల వెల్లువ

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:19 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం కార్యాలయంలో చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు స్వయంగా అభ్యంతరాలు స్వీకరించడంతో 20 బృందాలకుపైగా వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నాయి. గతంలోనే తాము ఈ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వైసీపీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం పట్టించుకోలేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మాస్టర్‌ ప్లాన్‌పై ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విజయనగరం ఎమ్మెల్యే అదితి స్వయంగా వచ్చి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసి, కొన్ని సూచనలు చేశారు.

మాస్టర్‌ ప్లాన్‌పై  అభ్యంతరాల వెల్లువ

ఎ-1 గ్రాండ్‌, ‘రాడిసన్‌’కు

మేలు చేసేందుకు ఒక వైపే రహదారి విస్తరణ

రోడ్డుకు మరో వైపు స్థలాలు కలిగి ఉన్నవారి అభ్యంతరం

నేరెళ్లవలసలో వీఎంఆర్‌డీఏ ప్లాట్ల మధ్య నుంచే

కోస్టల్‌ కారిడార్‌కు గతంలో ప్రతిపాదన

తమకు న్యాయం చేయాలని స్థలాల యజమానుల విజ్ఞాపన

దసపల్లా హిల్స్‌లో రహదారి విస్తరణ వద్దని స్థానికుల లేఖ

ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి సూచనలు

స్వయంగా దరఖాస్తులు స్వీకరించిన

చైర్మన్‌, కమిషనర్లు

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌-2041పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం కార్యాలయంలో చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు స్వయంగా అభ్యంతరాలు స్వీకరించడంతో 20 బృందాలకుపైగా వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నాయి. గతంలోనే తాము ఈ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వైసీపీ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం పట్టించుకోలేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మాస్టర్‌ ప్లాన్‌పై ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విజయనగరం ఎమ్మెల్యే అదితి స్వయంగా వచ్చి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసి, కొన్ని సూచనలు చేశారు.

అభ్యంతరాల్లో కొన్ని...

- రుషికొండలో బీచ్‌ రోడ్డును 60 (200 అడుగులు) మీటర్లకు విస్తరించాలని ప్రతిపాదించారు. అంటే రోడ్డు మధ్య నుంచి అటు 30 మీటర్లు, ఇటు 30 మీటర్లు విస్తరించాల్సి ఉండగా, ఎ-1 గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్వాహకులకు లబ్ధి చేకూర్చడానికి వైసీపీ నేతలు మొత్తం విస్తరణను దానికి ఎదురుగా ఉన్న రోడ్డు వైపు ప్రతిపాదించారు. అది సర్వే నంబర్‌ 25లో ఉంది. అక్కడ సుమారు 30 మందికి ప్లాట్లు ఉన్నాయి. వారంతా దీనిపై గతంలోనే అభ్యంతరం వ్యక్తంచేసినా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు దానిని న్యాయబద్ధంగా చేయాలని వారంతా కోరారు. దీనిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఒక లేఖ సమర్పించారు.

- నేరెళ్లవలసలో ఎస్‌ఓఎస్‌ నుంచి 70 మీటర్ల రహదారిని ప్రతిపాదించారు. వాస్తవానికి అది కోస్టల్‌ కారిడార్‌ రహదారి. వైసీపీ పెద్దలకు ఆ ప్రాంతంలో ఉన్న భూములకు మేలు జరిగేలా దాన్ని అక్కడ ఇష్టం వచ్చినట్టు మలుపులు తిప్పారు. ఆ క్రమంలో వుడా గతంలో వేసిన లేఅవుట్ల ప్లాట్ల మీదుగా ఆ రహదారి వెళ్లింది. అది తప్పు అని తెలిసినా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అధికారులు దానినే ఖరారు చేశారు. తామంతా మధ్య తరగతి ప్రజలమని న్యాయం చేయాలని వారంతా కోరారు.

- మధురవాడ సర్వే నంబర్‌ 337/407లో రామానాయుడు స్టూడియో సమీపాన జర్నలిస్టుల లేఅవుట్‌ మీదుగా ప్రతిపాదించిన 18 మీటర్ల రహదారిని తొలగించాలని సంఘం ప్రతినిధులు కోరారు.

- దసపల్లా హిల్స్‌ సర్వే నంబరు 1196లో నౌరోజీ రోడ్డు నుంచి వాల్తేరు మెయిన్‌ రోడ్డును కలుపుతూ వైసీపీ పెద్దలకు మేలు జరిగేలా చేపట్టిన రహదారి విస్తరణను నిలిపివేయాలని అక్కడ నివాసితులు కోరారు. అందరికీ అవసరమైన పార్కు ఏర్పాటుచేయాలని కోరారు.

- నిడిగట్టు గ్రామంలో ప్రతిపాదిత 24 మీటర్ల రహదారి వద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు కోరారు.

- హనుమంతవాక నుంచి జోడుగుళ్లపాలెం వరకూ ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని 60 అడుగులకు పరిమితం చేయాలని స్థానికులు కోరారు.

- అక్కయ్యపాలెం ప్రధాన రహదారి నుంచి రైల్వే న్యూకాలనీ వరకు ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని 60 అడుగులకు పరిమితం చేయాలని ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు.

- లంకెలపాలెం నుంచి షీలానగర్‌ వరకు ప్రతిపాదించిన 80 మీటర్ల రహదారి స్థానే 60 మీటర్లు ఉండాలని జీవీఎంసీ కార్పొరేటర్‌ స్టాలిన్‌ కోరారు.

- మధురవాడలో వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ పక్కనున్న 60 అడుగుల రహదారిని 100 అడుగులకు పెంచాలని ప్రతిపాదించారని, దానిని పునఃపరిశీలన చేయాలని అక్కడి వారు కోరారు.

- సాగర్‌నగర్‌ దాటిన తరువాత రాడిసన్‌ బ్లూ హోటల్‌ వద్ద బీచ్‌రోడ్డును 200 అడుగులకు విస్తరించాలని చూపించారని, అయితే హోటల్‌కు ఇబ్బంది లేకుండా ఇటు వైపు స్థలాలకు నష్టం జరిగేలా రహదారి నిర్మాణం ప్రతిపాదించారని, దానిని మార్చి రోడ్డు మధ్య నుంచి చెరిసగం చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు.

- పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు తన నియోజకవర్గంలో సుమారు 12 రహదారులకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు, సూచనలు చేశారు.

- విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు హైవేను కలుపుతూ బీచ్‌రోడ్డుకు గంభీరం, యాతపేట, కల్లివానిపాలెం, కోమటిపాలెం మీదుగా రహదారిని విస్తరించాలని కోరారు.

- విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ వన్‌టౌన్‌లో రహదారులను విస్తరించాలని కోరారు.

Updated Date - Jul 17 , 2025 | 01:19 AM