Share News

ఐదు దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ..

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:20 AM

ఐదు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న వాక రోడ్డు కల సాకారం కానుండడంతో ఈ ప్రాంత రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఐదు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. కానీ వైసీపీ నేతలు దీనిని రాద్ధాంతం చేస్తూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

ఐదు దశాబ్దాల కల   సాకారమవుతున్న వేళ..
రెవెన్యూ భూమిలో తుప్పలు తొలగించి వాక రోడ్డును బాగుచేసుకున్న రైతులు

రెండు వరుసల రహదారిగా అభివృద్ధి కానున్న వాక రోడ్డు

ఐదు మండలాలకు చెందిన ప్రజలకు తగ్గనున్న ప్రయాణ దూరం

మాకవరపాలెం, జూలై18 (ఆంధ్రజ్యోతి): ఐదు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న వాక రోడ్డు కల సాకారం కానుండడంతో ఈ ప్రాంత రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఐదు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. కానీ వైసీపీ నేతలు దీనిని రాద్ధాంతం చేస్తూ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. వాస్తవంగా వాక రోడ్డు నిర్మాణం విషయంలో స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కృషి ఎంతో ఉందని వారు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారి 1983లో జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు.. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎరకన్నపాలెం వచ్చారు. రాచపల్లి 737 సర్వే నంబరులో వున్న సుమారు 400 ఎకరాలను సాగు చేసుకుంటున్నామని, పంటలు/ ఫలసాయాన్ని అమ్ముకోవడానికి కాలిబాట ద్వారా ఎలమంచిలి వెళ్లి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాక రోడ్డు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అయ్యన్నపాత్రుడు.. ఎరకన్నపాలెం నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేయించారు. అయితే అప్పట్లో 737 సర్వే నంబరులో ఉన్న భూమికి సంబంధించి సరిహద్దుల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాలు వుండేవి. 1999లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు.. 737 సర్వే నంబరులో ఉన్న భూమిలో నుంచి ఉన్న కాలిబాటను సర్వే చేయించి, ఎలమంచిలి మండలం పెదపల్లి వరకు వాక రోడ్డును అభివృద్ధి చేయాలని భావించారు. కానీ రెవెన్యూ, అటవీ శాఖల సరిహద్దు వివాదం కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.

ఇదిలావుండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకవరపాలెం మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని అయ్యన్నపాత్రుడు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం మాకవరపాలెం నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలి. దీనివల్ల ప్రయాణ దూరం, సమయం ఎక్కువ అవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఎరకన్నపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపడితే పరిశ్రమలు ఏర్పాటు చేసే వారితోపాటు ఐదు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుందని భావించారు. ఈ మేరకు 60 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.

వైసీపీ రెండు నాలుకల ధోరణి

వాక రోడ్డు విషయంలో వైసీపీ నాయకులు వాస్తవాలను దాచిపెట్టి, రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాచపల్లి 737 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో నుంచి 1956కు ముందే కాలిబాట వున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే 1967లో కూడా దీనిని వాకరోడ్డుగా పేర్కొంటూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.తరువాత ఈ రోడ్డును ఆనుకొని వున్న రెవెన్యూ భూములను సాగుచేస్తుకుంటున్న రైతులపై అటవీ శాఖ అధికారులు కేసులు పెట్టారు. దీంతో 2022 వైసీపీ అధికారంలో వున్నప్పుడు 737 సర్వే నంబరులో 1,500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ శాఖ తేల్చి చెప్పడంతో అటవీ శాఖ అధికారులు మిన్నకుండిపోయారు. ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గణేశ్‌.. అటవీ శాఖ భూమిలో నుంచి రోడ్డు వేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్‌డీవోపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని రైతులు మండిపడుతున్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:20 AM