Share News

పండుగలా పేరెంట్‌, టీచర్‌ మీట్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:36 AM

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్‌, టీచర్‌ మీట్‌(పీటీఎం) 2.0ను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,955 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 134 జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేశారు.

పండుగలా పేరెంట్‌, టీచర్‌ మీట్‌
నక్కపల్లి ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో బాలికలతో కలిసి సహఫంక్తి భోజనం చేస్తున్న హోం మంత్రి అనిత

జిల్లా వ్యాప్తంగా 1,955 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 134 జూనియర్‌ కళాశాలల్లో నిర్వహణ

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశమై పాఠశాలల అభివృద్ధిపై చర్చ

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

ఉత్సాహంగా ఆటల పోటీలు

అనకాపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్‌, టీచర్‌ మీట్‌(పీటీఎం) 2.0ను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,955 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 134 జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాఽధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలల ప్రాంగణంలో సమావేశమై బడుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, నెలకొన్న సమస్యలపై చర్చించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆట పాటలతో ఆనందంగా గడిపారు. పాఠశాలల్లో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.

గొలుగొండ మండలం ఏఎల్‌ పురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో జరిగిన మెగా పేరెంట్‌, టీచర్‌ మీట్‌ కార్యక్రమంలో స్పీకర్‌ సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రపై ప్రసంగించారు. నక్కపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూండ్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కొప్పాక జడ్పీ ఉన్నత పాఠశాలలో అర్బన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, గవర సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర హాజరయ్యారు. రావికమతం జడ్పీ ఉన్నత పాఠశాల, వడ్డాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, మాడుగుల మండలం కింతలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. సబ్బవరంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జీ హాజరయ్యారు. అచ్యుతాపురం కేజీబీవీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు హాజరయ్యారు. జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు, సర్వశిక్ష ఏపీసీ జయప్రకాశ్‌ పరవాడ మండలం పెద ముషిడివాడ, లంకెలపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వినోద్‌బాబు పరవాడ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - Jul 11 , 2025 | 12:36 AM