అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:10 PM
మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలోని యర్రవరం జలపాతానికి వెళ్లే సమగిరి ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. తురబాడు గెడ్డ నుంచి సమగిరి వరకు ఎనిమిదేళ్ల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం తారు రోడ్డు నిర్మించింది.
తొమ్మిదేళ్ల క్రితం సమగిరి రహదారి నిర్మాణం
చిన్నపాటి గుంతలకు కూడా మరమ్మతులు చేయని గత వైసీపీ ప్రభుత్వం
ప్రస్తుతం ఛిద్రమైన రోడ్డు
పర్యాటకులు, గిరిజనులకు తప్పని అవస్థలు
చింతపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలోని యర్రవరం జలపాతానికి వెళ్లే సమగిరి ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. తురబాడు గెడ్డ నుంచి సమగిరి వరకు ఎనిమిదేళ్ల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం తారు రోడ్డు నిర్మించింది. మూడేళ్ల క్రితం ఈ రహదారిపై చిన్నపాటి గుంతలు ఏర్పడ్డాయి. సకాలంలో గత వైసీపీ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకపోవడం వలన ప్రస్తుతం రహదారి ఛిద్రమైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, గిరిజనులు అవస్థలు పడుతున్నారు.
మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో సమగిరి గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఆనుకుని మరో 20 గిరిజన గ్రామాలు ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతానికి కేవలం మెటల్ రోడ్డు మాత్రమే ఉండేది. దీంతో ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో 2016-17లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం ద్వారా తురబాడు గెడ్డ నుంచి సమగిరి వరకు 4.5 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షాల కారణంగా 2021లో ఈ రహదారిపై చిన్నపాటి గుంతలు ఏర్పడ్డాయి. స్థానిక ప్రజలు పలు మార్లు నాటి వైసీపీ పాలకులకు రహదారి మరమ్మతులు చేపట్టాలని అర్జీలు ఇచ్చినప్పటికి కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ రహదారిపై రాళ్లు తేలిపోయి ప్రమాదభరితంగా తయారైంది. పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయి.
అవస్థలు పడుతున్న పర్యాటకులు, గిరిజనులు
సమగిరి రహదారి అధ్వానంగా ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారి మీదుగా యర్రవరం జలపాతానికి వెళ్లాలి. ప్రతి ఏడాది అక్టోబరు నుంచి మార్చి వరకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో జలపాతాన్ని సందర్శిస్తుంటారు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభం కానుంది. దీంతో అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే సమగిరితో పాటు మరో 20 గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గంపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మలుపుల వద్ద రాళ్లు తేలిపోవడం వలన ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొత్తగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, పర్యాటకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
పట్టించుకోని అధికారులు
తురబాడు గెడ్డ నుంచి సమగిరి వెళ్లే మార్గంలో మరమ్మతులకు గురైన రహదారిని మరమ్మతుల చేయాలని స్థానిక గిరిజనులు గత నాలుగేళ్లగా ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చినప్పటికి ఎవరూ పట్టించుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ రహదారి అద్దం పడుతున్నది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి ఈ రహదారి పరిస్థితి మార్పు రాలేదు. స్థానిక గిరిజనులు, పర్యాటకులు ఈ రహదారిపై రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి సమగిరి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు, పర్యాటకులు కోరుతున్నారు.