రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:18 AM
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాల పంట పండించారు.
చోడవరం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటి పతకాల పంట పండించారు. అనంతపురం జయమణమ్మ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించిన 42వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాక జిల్లాకు చెందిన 12 మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. తైక్వాండో, కొరుగి, పోమ్‌సే విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పోమ్‌సే విభాగంలో చోడవరానికి చెందిన మిండ్రాన హేమశ్రీ, జి.శశివర్ధన్, విశాఖ నగరం ఆరిలోవ సహస్ర స్పోర్ట్స్ అకాడమీకి చెందిన గండి రిషిత, అల్లూరి జిల్లాకు చెందిన పి.ప్రవల్లిక, సత్యవేణి, దివ్య, గోవిందమ్మలు 8 బంగారు పతకాలు, 3 రజతపతకాలు, ఒక కాంస్య పతకం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటిన ఈ క్రీడాకారులు ఈ నెల 31 నుంచి నవంబరు 2 వరకూ బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు హర్షవర్ధన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు పల్లం మురళీకృష్ణలు అభినందించారు. ఈ పోటీలకు కోచ్‌లుగా కె.ప్రదీప్‌కుమార్, రాజేశ్, శేఖర్‌బాబు, సూర్యగోపాల్, చిట్టిబాబులు వ్యవహరించాలని తైక్వాండో జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.