Share News

ఆక్రమణలపై కొరడా

ABN , Publish Date - May 30 , 2025 | 12:52 AM

జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లో గల ఆక్రమణలను తొలగించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. ముందుగా మండలంలోని చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్న 30 మందిని గుర్తించారు.

ఆక్రమణలపై కొరడా
పాడేరు చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు

ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు అధికారుల చర్యలు

పాడేరురూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లో గల ఆక్రమణలను తొలగించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. ముందుగా మండలంలోని చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపడుతున్న 30 మందిని గుర్తించారు. గురువారం ఆ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల సహకారంతో కొన్ని నిర్మాణాలను తహసీల్దార్‌ వంజంగి త్రినాథరావు నాయుడు, ఆర్‌అండ్‌బీ ఈఈ పి.బాలసుందరరావు, ఆర్‌ఐ బి.నల్లన్నలు దగ్గరుండి తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ త్రినాథరావు నాయుడు మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాడేరు మండలంలో ఆక్రమణలను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. చింతలవీధి పంచాయతీ కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఆర్‌అండ్‌బీ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన 30 మందిని గుర్తించి వారికి గతంలోనే నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఆక్రమణలను తొలగించకపోవడంతో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారుల సమక్షంలో తొలగిస్తున్నట్టు చెప్పారు. పాడేరులో సుమారు 225 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరరావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్‌అండ్‌బీ స్థలాల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే రంపచోడవరం ప్రాంతంలో ఆక్రమణలను తొలగించామని చెప్పారు. పాడేరులో శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆక్రమణల తొలగింపులు ప్రారంభిస్తామన్నారు. గుర్తించిన ఆక్రమణలను ప్రతీ శనివారం తొలగించే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ డీఈ రామన్‌, జేఈ చందు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

చింతపల్లిలో 65 మందికి నోటీసులు జారీ

చింతపల్లి: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. చింతపల్లి మండలంలో తొలివిడతగా ఆర్‌అండ్‌బీ స్థలాలను ఆక్రమించుకున్న 65 మందికి నోటీసులు జారీ చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని, లేదంటే రెవెన్యూ అధికారులు తొలగిస్తారని నోటీసుల్లో పేర్కొన్నారు. మండల కేంద్రంలోని హనుమాన్‌ జంక్షన్‌ నుంచి డిగ్రీ కళాశాల వరకు ప్రధాన రహదారికి ఆనుకుని ఇరువైపులా స్థానికులు దుకాణాలను నిర్మించుకున్నారు. ఏన్నో ఏళ్లుగా ప్రజలు దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే హనుమాన్‌ జంక్షన్‌ నుంచి డిగ్రీ కళాశాల వరకు రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలు ప్రభుత్వానికి చెందినవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తాజాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో రెవెన్యూ అధికారులు చింతపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని నోటీసులు ఇస్తున్నారు. అలాగే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించిన వ్యక్తుల కట్టడాలను కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడేళ్ల క్రితం ఆర్‌అండ్‌బీ కార్యాలయం ఎదురుగా రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన దుకాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించేందుకు ముందడుగు వేస్తున్నారు. అయితే రహదారికి ఇరువైపులా నిర్మించుకున్న దుకాణాలను తొలగిస్తే ఉపాధి కోల్పోతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 30 , 2025 | 12:52 AM