అనుమానాస్పదంగా కాంట్రాక్టు ఉద్యోగిని మృతి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:05 PM
అంత్యక్రియలు ఆపి వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన సంఘటన మండల కేంద్రం డుంబ్రిగుడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
ఆఫీస్‌లో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగిని
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
అంత్యక్రియలకు సిద్ధపడిన కుటుంబ సభ్యులు
శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టంకు తరలింపు
ఆమె మృతిపై అనుమానాలు
వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
డుంబ్రిగుడ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన డుంబ్రిగుడకి చెందిన మండ్యాగురు జగదీశ్‌రెండో భార్య జయ పాడేరు గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు బేసిక్‌పై రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈనెల పదో తేదీన ఆమె విధులకు అయ్యింది. కొద్ది సేపటి తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడి సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం భర్తకు ఈ సమాచారాన్ని ఫోన్ ద్వారా అందించారు. ఆసుపత్రిలో చేర్చించిన కొద్దిసేపటి తర్వాత ఆమె మృతి చెందడంతో అదే రోజు మధ్యాహ్నం జయ మృతదేహాన్ని డుంబ్రిగుడ గ్రామానికి భర్త జగదీశ్ తరలించారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు జయ మృతదేహానికి స్నానం చేసే సమయంలో ఆమె శరీరంపై బలమైన గాయాలు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు అనుమానించారు. అంత్యక్రియలను ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను కొట్టి చంపినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని అరకులోయ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ విషయాన్ని డుంబ్రిగుడ ఎస్‌ఐ పాపినాయుడు వద్ద ప్రస్తావించగా కాంట్రాక్టు ఉద్యోగి జయ గుండెపోటుతో మరణించినట్టు భావించామన్నారు. కుటుంబ సభ్యుల వత్తిడి మేరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ పాపినాయుడు తెలిపారు.