కలగానే కాఫీ పల్పింగ్ యూనిట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:53 AM
: పాడేరు సమగ్ర గిరిజాభిృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారులు మండల కేంద్రంలో చేపట్టిన కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. నాలుగేళ్ల నుంచి అసంపూర్తిగా వుండడంతో కాఫీ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జీకే వీధిలో పూర్తిగాని నిర్మాణం
నాలుగేళ్ల క్రితం రూ.1.3 కోట్లతో పనులు ప్రారంభం
తొలి విడత బిల్లు చెల్లించని అప్పటి వైసీపీ ప్రభుత్వం
పనులు ఆపేసిన కాంట్రాక్టర్
చెర్రీ ఉత్పత్తికే పరిమితమైన కాఫీ రైతులు
గూడెంకొత్తవీధి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పాడేరు సమగ్ర గిరిజాభిృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారులు మండల కేంద్రంలో చేపట్టిన కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. నాలుగేళ్ల నుంచి అసంపూర్తిగా వుండడంతో కాఫీ రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గిరిజన రైతులు పండించే కాఫీ పండ్ల నుంచి నాణ్యమైన పార్చిమెంట్ ఉత్పత్తి చేసేందుకు చింతపల్లి కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ తరహాలో రూ.1.3 కోట్ల ట్రైకార్ నిధులతో గూడెంకొత్తవీధిలో కూడా నిర్మించేందుకు ఐటీడీఏ అధికారులు 2021వ సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసి కాఫీ రైతులకు అందుబాటులోకి తీసుకువస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం తొలి విడత బిల్లు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. అప్పటి నుంచి ఎటువంటి కదలికలేదు. ఎకో పల్పింగ్ కోసం రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా పడివున్నాయి. ఆరు బయట వుంచడంతో వర్షాలకు, మంచుకు తుప్పు పడుతున్నాయి. ఎకో పల్పింగ్ యూనిట్‌కి విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి ఈపీడీసీఎల్‌కు సుమారు రూ.8 లక్షలు చెల్లించాలి. ఈ నిధులను సైతం అప్పటి ప్రభుత్వం విడుదల చేయలేదు. కాఫీ పార్చిమెంట్‌కు ఎకో పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి రాకపోవడంతో రైతులు చెర్రీగానే ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ధర లభించి, ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇక్కడ ఎకో పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి రాకపోవడం వల్ల మండలానికి చెందిన రైతులు కాఫీ పండ్లను చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌కి తీసుకెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల రవాణా ఖర్చుల భారం పడుతున్నది.
పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే..
జిల్లాలో అత్యధికంగా కాఫీ తోటలు గూడెంకొత్తవీధి మండలంలోనే వున్నాయి. ఇక్కడ మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు వున్నాయి. ఏటా 4,200 టన్నుల క్లీన్ కాఫీని ఉత్పత్తి చేస్తున్నారు. మండల కేంద్రంలో ఎకో పల్పింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే కాఫీ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తోటల నుంచి సేకరించిన పండ్లను వెంటనే ఎకో పల్పింగ్ యూనిట్‌కి తరలించే అవకాశం వుంటుంది. రైతులు చెర్రీగా కాకుండా, పార్చిమెంట్‌గా విక్రయించుకుని గరిష్ఠ ధర పొందే వీలుంటుంది. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించి కాఫీ ఎకో పల్పింగ్ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.