అరుదైన పంటలకు కలిసొచ్చిన వాతావరణం
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:55 PM
జిల్లాలో ఈశాన్య రుతుపనాల ప్రభావం వలన కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జిల్లాపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం
భారీగా తగ్గనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాజ్‌మా, వలిసెలు, స్ట్రాబెర్రీ పంటలకు అనుకూలం
నైరుతిలో పుష్కలంగా వర్షాలు
చింతపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈశాన్య రుతుపనాల ప్రభావం వలన కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన గ్రామాలు పర్వత ప్రాంతాల మధ్యలో ఉన్నందున చలి ఉధృతి అధికంగా ఉంటుందని, డిసెంబరు, జనవరిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గిరిజన ప్రాంతంలో నైరుతిలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. దీంతో వరి, కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం పంటలకు కలిసివచ్చింది. ఈశాన్య రుతు పవనాల వలన రాజ్‌మా, వలిసెలు, స్ట్రాబెర్రీ, విదేశీ కూరగాయల సాగుకు వాతావరణం అనుకూలిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
దక్షిణ భారతదేశంలో పాడేరు రెవెన్యూ డివిజన్ విభిన్న వాతావరణం కలిగి ఉంటుంది. ఉత్తర భారతదేశాన్ని పోలి ఉండడం వలన ఈ ప్రాంతంలో అరుదైన పంటలు సైతం పండుతున్నాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. పాడేరు రెవెన్యూ డివిజన్ గిరిజన ప్రాంతాలు సముద్రమట్టానికి 3,100 నుంచి 3,800 అడుగుల ఎత్తులో ఉన్నాయి. గ్రామాలు పర్వతాల మధ్యలో ఉండడం వలన అధిక వర్షాలు, చలి తీవ్రత అధికంగా ఉంటుంది. వేసవిలోనూ పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు మించి నమోదుకాదు. వేసవి తీవ్రత అధికంగా ఉంటే ఒకటీ, రెండు రోజులు 38-40 డిగ్రీలు నమోదవుతాయి. శీతాకాలం చింతపల్లి, పాడేరు, అరకు, పెదబయలు, జి.మాడుగుల ప్రాంతాల్లో ఎనిమిది కంటే తక్కువగాను, లంబసింగి, కుంతలం ప్రాంతాల్లో సున్న, ఒకటీ, రెండు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈశాన్య రుతుపవనాల ప్రభావం
దేశ వ్యాప్తంగా నైరుతి తిరోగమనం చెంది అక్టోబరు రెండో పక్షంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వలన తమిళనాడులో అత్యధికంగా వర్షాలు పడతాయి. జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో గిరిజన ప్రాంతంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. గాలి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికి తేమ ఎక్కువగా ఉంటుంది. ఆవిరి పరిమాణం తగ్గడం వలన వాతావరణం చల్లగా మారుతుంది. ఉదయం మంచు, సాయంత్రం చల్లని గాలులు, తక్కువ సూర్యకాంతి ఉంటుంది. ఈ కాలంలో కొన్నేళ్లగా గిరిజన ప్రాంతంలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం వరకు లంబసింగి, కుంతలం, చింతపల్లి ప్రాంతాల్లో జనవరి, డిసెంబరు మాసాల్లో సున్న, 0.5, ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత మూడేళ్లగా వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. గత ఏడాది ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే నవంబరులో 11.2 డిగ్రీలు, డిసెంబరులో 7.4 డిగ్రీలు, జనవరిలో 4.9 డిగ్రీలు, ఫిబ్రవరిలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల తీవ్రత అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. దీంతో గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యే అవకాశం ఉంది.
నైరుతిలో పుష్కలంగా వర్షాలు
జిల్లాలో ఈ ఏడాది నైరుతి పవనాల కాలంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షపాతం అధికంగా నమోదైంది. ఈ కాలంలో జిల్లా సాధారణ వర్షపాతం 19,689 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది 19,766.5 మిల్లీమీటర్లు నమోదైంది. కూనవరం మండలంలో అత్యధికంగా 1,261.7 మిల్లీమీటర్లు, జి.మాడుగుల మండలంలో అత్యల్పంగా 752.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు, అరకులోయ, హుకుంపేట మండలాల్లో వర్షపాతం సాధారణ స్థాయిలోనూ, అనంతగిరి, పాడేరులో స్వల్ప లోటు నమోదైంది. నైరుతిలో జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి. దీంతో వ్యవసాయానికి అనుకూలించింది. భూగర్భ జలాల రీచార్జిలో పెరుగుదల కనిపించింది. కాఫీ, మిరియాలు, వరి, పసుపు, అల్లం పంటలకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.